- ట్రంప్‌కు మోదీ సాగిలపడ్డారు.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ ఫైర్
- యూపీఐ ఎండీఆర్ చార్జీలపై కేంద్రం వివరణ బుకాయింపే
- నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- రూ.2 వేలు దాటిన లావాదేవీలపై ఎండీఆర్ మోత..
- దేశ ప్రజల కష్టాన్ని అమెరికా కంపెనీల ఖాతాల్లోకి మళ్లిస్తారా? అని మండిపాటు
- యూపీఐ లావాదేవీలపై చార్జీలను ఉపసంహరించుకోవాలి: ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇది పన్ను కాదంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన స్పష్టతను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. దీనిని ముమ్మాటికీ ‘యూపీఐ పన్ను’గానే పేర్కొన్న ఆయన.. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తేవడంతో ప్రధాని నరేంద్ర మోదీ తలొగ్గారని, అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీల జేబులు నింపేందుకే స్వదేశీ డిజిటల్ వ్యవస్థను బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు.
మోదీజీ వెన్నెముకతో నిలబడండి..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చారిత్రక వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘‘గతంలో ఇందిరాజీని ‘మీరు లెఫ్టా? రైటా?’ అని అడిగినప్పుడు.. ‘నేను అటూ కాదు ఇటూ కాదు, నిటారుగా నిలబడతాను’ అని సమాధానమిచ్చారు. కానీ, మోదీజీ సిద్ధాంతం పూర్తిగా భిన్నం. ఆయన ఎడమవైపు మొగ్గరు, కుడివైపు చూడరు.. నేరుగా డొనాల్డ్ ట్రంప్ పాదాల చెంత సాష్టాంగపడతారు. యూపీఐపై పన్ను రూపంలో భారతీయుల కష్టార్జితాన్ని భారీ ఎత్తున అమెరికా కంపెనీల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఇకనైనా ప్రధాని మోదీ అమెరికా ముందు తలవంచడం మాని, వెన్నెముకతో నిలబడి ఈ యూపీఐ పన్నును వెంటనే రద్దు చేయాలి” అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
చార్జీలను ఉపసంహరించుకోవాలి: ప్రతిపక్షాలు
యూపీఐ చెల్లింపులపై విధించిన ఎండీఆర్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. వీసా, మాస్టర్‌కార్డ్ లాంటి అమెరికన్ కంపెనీలకు యూపీఐతో పోటీని కల్పించడానికే ఈ 0.4 శాతం ఎండీఆర్ తెచ్చారా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ ‘నోటా’ నిర్వచనాన్ని ‘నరేంద్రాస్ ఆన్‌గోయింగ్ ట్రంప్ అపీజ్‌మెంట్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. గతంలో ఎండీఆర్ విధించబోమని చెప్పిన ఆర్థిక శాఖ ఇప్పుడు యూ-టర్న్ తీసుకుందని విమర్శించారు.
ఈ చార్జీని నేరుగా వినియోగదారులపై కాకుండా వ్యాపారులపై వేసినప్పటికీ, అంతిమంగా వస్తువుల ధరలు పెరిగి ప్రజలపైనే ఆ భారం పడుతుందని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది అమెరికా సామ్రాజ్యవాద ఒత్తిడికి తలొగ్గి తీసుకున్న నిర్ణయమని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా విమర్శించారు. యూపీఐ అనేది ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన డిజిటల్ వ్యవస్థ అని, విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దాన్ని దెబ్బతీయవద్దని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. వెంటనే ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని కోరారు.
దొడ్డి దారిన నోటిఫికేషన్: సుప్రియా శ్రీనటె
యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండబోవని గతంలో పార్లమెంట్‌కు అబద్ధాలు చెప్పి, దొడ్డిదారిన నోటిఫికేషన్ విడుదల చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటె మండిపడ్డారు. ‘‘యూపీఐ వ్యవస్థను నడపడానికి ఏటా రూ.20,700 కోట్లు ఖర్చవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ప్రభుత్వానికి బదిలీ చేసిన మిగులు నిధులే రూ.3 లక్షల కోట్లు. లిస్టెడ్ బ్యాంకుల లాభాలు రూ.4.11 లక్షల కోట్లు దాటాయి.
యూపీఐని నడుపుతున్న ఎన్‌పీసీఐ పన్నుకు పూర్వ లాభమే రూ.1,888 కోట్లుగా ఉంది. ఆర్బీఐ ఇచ్చిన నిధుల్లో 7.2% వాడితే యూపీఐని పైసా భారం లేకుండా ఫ్రీగా నిర్వహించవచ్చు. అలాంటప్పుడు దేశ ప్రజల డిజిటల్ వ్యవస్థను విదేశీ కంపెనీలకు ఎందుకు తాకట్టు పెడుతున్నారు?’’ అని ప్రశ్నించారు.
