గోదావరిఖని, వెలుగు: అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి డబ్బులు దండుకొని మోసగించిన కేసులో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి రాగుల లక్ష్మీనారాయణకు మూడేండ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. గ్రానైట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని యైటింక్లయిన్ కాలనీకి చెందిన కాసర్ల సుమన్‌కు లక్ష్మీనారాయణ ఆశ చూపాడు. తనకు తిమ్మాపూర్ మండలంలోని సర్వే నంబర్ 158లో ఉన్న ఎస్పీఆర్ గ్రానైట్ కంపెనీలో 50 శాతం వాటా ఉందని, అందులో పెట్టుబడి పెడితే 15 శాతం వాటా ఇస్తానని నమ్మించాడు.
దీంతో సుమన్ తన తండ్రి లింగయ్య సింగరేణిలో పదవి విరమణ చేయగా వచ్చిన డబ్బులు రూ.10 లక్షలను 2023 ఏఫ్రిల్‌లో లక్ష్మీనారాయణకు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో సుమన్ ఆరా తీసి లక్ష్మీనారాయణకు గ్రానైట్ కంపెనీలో ఎలాంటి వాటాలేదని గుర్తించాడు. లక్ష్మీనారాయణను నిలదీయడంతో చంపుతానని బెదిరించాడు. దీంతో సుమన్ గోదావరిఖని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ వెంకటేశ్వర్లు నిందితుడిపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా ప్రస్తుత సీఐ కె.ప్రసాదరావు ఆధ్వర్యంలో సాక్షులను ప్రవేశపెట్టారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నహేదా ఫర్హీన్ వాదనలు వినిపించగా లక్ష్మీనారాయణపై నేరం రుజువైంది. దీంతో న్యాయమూర్తి నల్లాల వెంకట సచిన్ రెడ్డి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.
