- వేర్వేరు చోట్ల ఇద్దరు హత్య
- కోరుట్లలో అనుమానంతో భార్యను చంపిన భర్త
- ఆస్తి గొడవలతో తనుగులలో యువకుడిని చంపిన కుటుంబసభ్యులు
కోరుట్ల/జమ్మికుంట, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం వేర్వేరు చోట్ల రెండు హత్యలు వెలుగు చూశాయి. కోరుట్లలో అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేయగా, తనుగులలో ఆస్తి గొడవల కారణంగా కుటుంబ సభ్యుల చేతిలో యువకుడు చనిపోయాడు.
కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన అన్నం లక్ష్మి (48), నరేశ్ దంపతులు. వీరి కుమారుడు హరినాథ్, కూతురు నవ్యశ్రీ హైదరాబాద్ లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. నరేశ్ కథలాపూర్ మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్లో వాచ్ మెన్ గా పనిచేస్తుండగా, లక్ష్మి ప్రకాశం రోడ్డు అంగన్ వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేస్తోంది.
లక్ష్మిపై అనుమానం పెంచుకున్న నరేశ్ తరచుగా కొడుతూ, వేధించేవాడు. దీంతో లక్ష్మి కొన్ని రోజులుగా భీమునిదుబ్బ ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఇటీవల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో లక్ష్మిని ఒప్పించి ఇంటికి తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన నరేశ్ టవల్ ను లక్ష్మి గొంతుకు బిగించి హత్య చేశాడు.
అనంతరం లక్ష్మి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ఆమెను చంపేశానని, డెడ్ బాడీని తీసుకువెళ్లండి అని చెప్పి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలాన్ని సీఐ లక్ష్మీనారాయణ పరిశీలించారు. లక్ష్మి కొడుకు హరినాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కాగా, లక్ష్మిని హత్య చేసిన నరేశ్ను కఠినంగా శిక్షించాలంటూ అంగన్వాడీ టీచర్లు కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. సర్ పేరుతో రాత్రనక, పగలనక ఫోన్లు చేస్తుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, లక్ష్మి హత్యకు సర్ సర్వేనే కారణమని ఆరోపించారు. లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆస్తి గొడవలతో...
ఆస్తి తగాదాలు, మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడన్న కోపంతో తల్లి, అక్క, బావ కలిసి యువకుడిని హత్య చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం... ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన వొజ్జపల్లి రాజబాబు(35)కు గతంలో వివాహం కాగా భార్య వదిలిపెట్టి వెళ్లింది.
దీంతో రాజబాబు తన తల్లి లచ్చమ్మతో కలిసి జమ్మికుంటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రాజబాబు నిత్యం తల్లి, అక్క, బావతో గొడవకు దిగేవాడు. ఈ నెల 7న జమ్మికుంట మండలం తనుగులలోని తన అక్కబావ కవిత, శంకర్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో 8వ తేదీన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం 10వ తేదీన మరోసారి తనుగుల వెళ్లి తన పొలం అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారంటూ.. తల్లి, అక్క, బావతో వాగ్వాదానికి దిగాడు.
దీంతో ఆగ్రహానికి గురైన వారు తమ బంధువులైన మారేపల్లి రాజయ్య, చేతి వెంకటేశ్, జూపాక సతీశ్, గుంటి శంకర్ తో కలిసి రాజబాబును హత్య చేశారు. అనంతరం తనుగుల గ్రామంలోని తమ పొలం సమీపంలో పూడ్చి వేశారు. ఎన్నిరోజులైనా రాజబాబు జమ్మికుంటలోని ఇంటికి రాకపోవడంతో ఆ ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రాజబాబు తల్లి లచ్చమ్మ, అక్కాబావ కవిత, శంకర్ ను పిలిపించి విచారించగా.. తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి తహసీల్దార్ గడ్డం సుధాకర్ సమక్షంలో రాజబాబు డెడ్ బాడీని బయటకు తీశారు. రాజబాబును హత్య చేసిన ఏడుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.
