జగిత్యాల టౌన్: ఒమన్‌‌‌‌‌‌‌‌ నుంచి స్వగ్రామానికి 15 మంది బాధితులు..

జగిత్యాల టౌన్: ఒమన్‌‌‌‌‌‌‌‌ నుంచి స్వగ్రామానికి 15 మంది బాధితులు..
  •     గల్ఫ్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాల పేరుతో ఏజెంట్ మోసం

జగిత్యాల టౌన్, వెలుగు: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ కార్మికులు ఏజెంట్ చేతిలో మోసపోయారు. గల్ఫ్ దేశంలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.లక్షల్లో వసూలు చేసి, తీరా అక్కడికి వెళ్లాక అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్ గంగాధర్ ఉద్యోగాల పేరుతో 15 మంది నుంచి సుమారు రూ.2 లక్షల చొప్పున వసూలు చేసి ఒమన్‌‌‌‌‌‌‌‌కు పంపించాడు. తీరా అక్కడికి వెళ్లాక చెప్పిన పనులు కాకుండా వేరే పనులు చేయిస్తూ, జీతాలు ఇవ్వకుండా వేధించడం ప్రారంభించారు. 

సరైన ఆహారం ఇవ్వకుండా దాడులకు కూడా పాల్పడ్డారని బాధితులు వాపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్​తోపాటు మరికొందరు డబ్బులు సమకూర్చడంతో ఎట్టకేలకు స్వగ్రామాలకు చేరుకున్నట్లు చెప్పారు. ఒమన్​లో ఇప్పటికీ  150 మందికి పైగా కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారని, తమను సురక్షితంగా భారత్‌‌‌‌‌‌‌‌కు రప్పించాలని వారు వేడుకుంటున్నారని బాధితులు తెలిపారు. ఈ వ్యవహారంపై బాధితులు ఎస్పీ అశోక్ కుమార్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏజెంట్ గంగాధర్‌‌‌‌‌‌‌‌పై గతంలోనూ కేసులు నమోదయ్యాయని, అప్పట్లో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి 104 పాస్‌‌‌‌‌‌‌‌పోర్టులు, వీసాలు సీజ్ చేశారని గుర్తుచేశారు. అయినా కన్సల్టెన్సీ పేర్లు మార్చి మళ్లీ నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని,  ఒమన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నవారిని స్వదేశానికి రప్పించాలని కోరారు.