మందులకు లొంగని  మొండి టీబీ!..రాష్ట్రంలో 3,400 మందికి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ క్షయ

మందులకు లొంగని  మొండి టీబీ!..రాష్ట్రంలో 3,400 మందికి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ క్షయ
  • కోర్సు మధ్యలోనే ఆపేయడమే ప్రధాన కారణం
  • గాలి ద్వారా నేరుగా ఆరోగ్యవంతులకూ సోకే చాన్స్​
  • ప్రైవేట్​లో చికిత్స పొందుతున్న 36 వేల మందిపై కొరవడిన పర్యవేక్షణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాధారణ ఔషధాలకు లొంగని మొండి క్షయ(మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ – ఎండీఆర్ టీబీ) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి బారినపడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,400 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. క్షయ నిర్ధారణ అయిన రోగులు నిర్దేశిత కాలం పాటు మందులు వాడకుండా, కాస్త ఉపశమనం కలగగానే మధ్యలోనే ఆపేయడం వల్ల బ్యాక్టీరియా మందులను తట్టుకునే స్థాయికి రూపాంతరం చెందుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మందులు మధ్యలో ఆపితేనే ముప్పు..

సాధారణ క్షయ నిర్ధారణ అయిన రోగులకు ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ వంటి ప్రాథమిక ఔషధాలను కనీసం 6 నెలల పాటు క్రమం తప్పకుండా వాడాలని సూచిస్తారు. కానీ చాలామంది నెల రోజుల్లోనే దగ్గు తగ్గిందన్న భావనతో చికిత్సను మధ్యలో ఆపేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల బ్యాక్టీరియా నశించకపోగా, ఆ మందులను తట్టుకునేలా మరింత బలాన్ని సంతరించుకుని ప్రమాదకరమైన ఎండీఆర్ గా మారుతోంది.

ప్రైవేట్ రోగులపై నిఘా కరువు..

రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 36,700 మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వీరు నిర్దేశిత కోర్సును పూర్తి చేస్తున్నారా.. లేదా? అనే అంశంపై ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్​లో చికిత్స మొదలుపెట్టి, ఖర్చులు భరించలేకో.. లేదా నిర్లక్ష్యంతోనో మధ్యలోనే మందులు మానేసి ఎండీఆర్ రోగులుగా మారుతున్నారు. పరిస్థితి విషమించాకే ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటంతో ప్రాణనష్టం పెరుగుతోంది.

ప్రైవేట్ రోగులను ట్రాక్ చేసేందుకు ఏర్పాటు చేసిన పేషెంట్ ప్రొవైడర్ సపోర్ట్ ఏజెన్సీల పనితీరు నామమాత్రంగానే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ప్రైవేట్​ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునే ప్రతి రోగి వివరాలను తప్పనిసరిగా నిక్షయ్ పోర్టల్‌‌‌‌లో నమోదు చేయాలని, 99 డాట్ వంటి డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని పటిష్టం చేసి, అధిక ముప్పున్న ప్రాంతాల్లో సంచార ల్యాబ్‌‌‌‌ ల ద్వారా ముందస్తు పరీక్షలు చేయాలని ఆరోగ్య 
నిపుణులు కోరుతున్నారు.

మరణాల రేటు ఆందోళనకరం..

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్​ఆస్పత్రుల్లో కలిపి ఏడాదికి సుమారు 81,600 సాధారణ టీబీ కేసులు నమోదవుతున్నాయి. జాతీయ లక్ష్యాల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు క్షయ కేసులను 47లోపు పరిమితం చేయాల్సి ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి లక్షకు 212 కేసులు నమోదవుతున్నాయి. మరణాల రేటు మరింత కలవరపెడుతోంది. కేంద్రం నిర్దేశించిన ఎండ్ టీబీ లక్ష్యం ప్రకారం ప్రతి లక్ష జనాభాకు మరణాల సంఖ్యను 3 లోపు తీసుకురావాల్సి ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం 30 వరకు నమోదవుతున్నాయి. అంటే లక్ష్యంతో పోలిస్తే మరణాల తీవ్రత దాదాపు పది రెట్లు అధికంగా ఉంది.

గాలి ద్వారా నేరుగా వ్యాప్తి..

ఎండీఆర్ టీబీ బారినపడిన వారిలో రెండు నుంచి మూడు వారాలకు మించి తీవ్ర దగ్గు, కఫంలో రక్తం, ఛాతీ నొప్పి, ఆకలి, -బరువు తగ్గడం, రాత్రిపూట జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి రోగులు దగ్గినా, తుమ్మినా బ్యాక్టీరియా తుంపర్ల రూపంలో గాలిలోకి చేరుతుంది. ఆ గాలిని పీల్చిన ఆరోగ్యవంతులకూ వ్యాధి సోకుతుంది. గతంలో ఎప్పుడూ క్షయ సోకని వారికి కూడా మొదటిసారే నేరుగా ఎండీఆర్ టీబీ సోకే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు త్వరగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.