ఇవాళ (సెప్టెంబర్ 17) అఫ్గానిస్తాన్తో ఇండియా మూడో టీ20.. వైభవ్‌‌కు చాన్స్‌‌ దక్కేనా?

ఇవాళ (సెప్టెంబర్ 17) అఫ్గానిస్తాన్తో ఇండియా మూడో టీ20.. వైభవ్‌‌కు చాన్స్‌‌ దక్కేనా?
  •  క్లీన్‌‌స్వీప్‌‌పై టీమిండియా దృష్టి
  •  రా. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌‌పై టీ20 సిరీస్‌‌ను సొంతం చేసుకున్న ఇండియా.. ఆఖరిదైన మూడో మ్యాచ్‌‌కు రెడీ అయ్యింది. గురువారం జరిగే ఈ పోరులో తమ సాధారణ జట్టు కూర్పును మార్చి రిజర్వ్‌‌ బెంచ్‌‌కు చాన్స్‌‌ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వండర్‌‌ కిడ్‌‌ వైభవ్‌‌ సూర్యవంశీకి చాన్స్‌‌ ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. జులైలో జరిగిన ఇంగ్లండ్‌‌ టూర్‌‌లో ఓపెనర్‌‌ సంజూ శాంసన్‌‌ ఫామ్‌‌లో లేకపోతేనే వైభవ్‌‌కు చాన్స్‌‌ ఇచ్చారు.

కానీ ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌‌ల్లో వైభవ్‌‌ ఎంపికను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం శాంసన్‌‌, అభిషేక్‌‌ శర్మ ఇద్దరూ మంచి ఫామ్‌‌లో ఉన్నారు. ఈ ఫార్మాట్‌‌లో వీళ్లు క్రమం తప్పకుండా ఆడే ప్లేయర్లు కాబట్టి విశ్రాంతికి మొగ్గు చూపకపోవచ్చు. ఎందుకుంటే ఆసియా క్రీడల కోసం ఇదే టీమ్‌‌ జపాన్‌‌ వెళ్లనుంది. ఒకవేళ సూర్యవంశీకి కచ్చితంగా చాన్స్‌‌ ఇవ్వాలని భావిస్తే ఇషాన్‌‌ కిషన్‌‌ బెంచ్‌‌కు పరిమితం కావొచ్చు.

ఇప్పటికే శాంసన్‌‌ వికెట్‌‌ కీపింగ్‌‌ బాధ్యతలు నిర్వహిస్తుండటంతో దీనికి మేనేజ్‌‌మెంట్‌‌ మొగ్గు చూపొచ్చు. ఈ సిరీస్‌‌కు ముందు ఇషాన్‌‌ దులీప్‌‌ ట్రోఫీలో ఈస్ట్‌‌ జోన్‌‌కు కెప్టెన్‌‌గా కూడా వ్యవహరించాడు. శ్రేయస్‌‌ అయ్యర్‌‌, తిలక్‌‌ వర్మ కూడా మరింత మ్యాచ్‌‌ ప్రాక్టీస్‌‌ను కోరుకుంటున్నారు. టాప్‌‌ బ్యాటర్లే లక్ష్యాన్ని ఛేదిస్తుండటంతో నితీశ్‌‌ రెడ్డి, శివమ్‌‌ దూబేలాంటి వాళ్లకు బ్యాటింగ్‌‌ చాన్స్‌‌ రాలేదు. బౌలింగ్‌‌లో నితీశ్‌‌ ఫామ్‌‌లోకి రావడం ఉత్సాహాన్నిచ్చే అంశం. ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా అతన్ని భావిస్తున్నారు. కాబట్టి భవిష్యత్‌‌ ప్రణాళికల్లో నితీశ్‌‌ కీలకం కానున్నాడు. రవి బిష్ణోయ్‌‌కు మరో చాన్స్‌‌ దక్కొచ్చు. పేసర్లుగా అర్ష్‌‌దీప్‌‌, బుమ్రా కంటిన్యూ కానున్నారు. యష్‌‌ ఠాకూర్‌‌కు అవకాశం దక్కొచ్చు.   

పరువు కోసం..

వరుసగా రెండు మ్యాచ్‌‌ల్లో ఓడిన అఫ్గానిస్తాన్‌‌ పరువు కోసం పోరాడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌‌లోనైనా గెలిచి సిరీస్‌‌ క్లీన్‌‌స్వీప్‌‌ కాకుండా అడ్డుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇండియాను దీటుగా ఎదుర్కోవాలంటే అఫ్గాన్‌‌ బ్యాటింగ్‌‌లో రాణించాల్సి ఉంటుంది. తొలుత బ్యాటింగ్‌‌ చేస్తే కనీసం 200 రన్స్‌‌ చేయాలి. ఇది జరగాలంటే టాప్‌‌ ఆర్డర్‌‌లో రెహమానుల్లా గుర్బాజ్‌‌, ఇబ్రహీం జద్రాన్‌‌, సెడిఖుల్లా అటల్‌‌, గుల్బాదిన్‌‌ నైబ్‌‌ రాణించాల్సి ఉంటుంది.

కానీ వీళ్లలో ఏ ఒక్కరూ సరైన ఫామ్‌‌లో లేరు. అఫ్గాన్‌‌ బ్యాటింగ్‌‌తో పోలిస్తే బౌలింగ్‌‌లో చాలా మెరుగ్గా ఉంది. చిన్న టార్గెట్‌‌ను కాపాడటంలో వీళ్లు ఇండియాను దీటుగా నిలువరిస్తున్నారు. ముఖ్యంగా స్టార్‌‌ స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌, ముజీబ్‌‌, నూర్‌‌ అహ్మద్‌‌ వికెట్లు తీస్తున్నారు. ఈ మ్యాచ్‌‌లో నవీన్‌‌ ఉల్‌‌ హక్‌‌ ఆడే అవకాశం ఉంది. 
తుది జట్లు (అంచనా)
ఇండియా: శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (కెప్టెన్‌‌), అభిషేక్‌‌ శర్మ, సంజూ శాంసన్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ / వైభవ్‌‌ సూర్యవంశీ, తిలక్‌‌ వర్మ, అక్షర్‌‌ పటేల్‌‌, నితీశ్‌‌ కుమార్‌‌, రవి బిష్ణోయ్‌‌, యష్‌‌ ఠాకూర్‌‌, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌, బుమ్రా. 
అఫ్గానిస్తాన్‌‌: ఇబ్రహీం జద్రాన్‌‌ (కెప్టెన్‌‌), రెహమానుల్లా గుర్బాజ్‌‌, సెడిఖుల్లా అటల్‌‌, గుల్బాదిన నైబ్‌‌, డార్విష్‌‌ రసోలి, అజ్మతుల్లా ఒమర్‌‌జాయ్‌‌, మహ్మద్‌‌ నబీ, రషీద్‌‌ ఖాన్‌‌, ముజీబ్‌‌ ఉర్‌‌ రెహమాన్‌‌ / నవీన్‌‌ ఉల్‌‌ హల్‌‌, ఫజల్‌‌హక్‌‌ ఫారుఖీ / అబ్దొల్లా ఒమర్‌‌జాయ్‌‌. 
పిచ్‌‌, వాతావరణం బ్యాటింగ్‌‌ పిచ్‌‌, చిన్న డైమెన్షన్‌‌ కారణంగా భారీ హిట్టింగ్‌‌కు అవకాశం. వర్ష సూచన లేదు. 


17ఢిల్లీలో ఆడుతున్న 17వ టీ20 మ్యాచ్​. ముంబైతో కలిసి అత్యధికంగా మ్యాచ్​లు నిర్వహించిన రెండో వేదిక ఇది. 

4టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి రషీద్‌‌ ఖాన్‌‌కు అవసరమైన వికెట్లు.