- యూఎస్, చైనా, రష్యా తర్వాత ఈ సత్తా గల నాలుగో దేశంగా భారత్
- స్పేస్‌లో వెపన్స్ మోహరించామని తాజాగా అమెరికా ప్రకటన
- చైనా, రష్యా కూడా ప్రయత్నాలు
న్యూఢిల్లీ: దేశ రక్షణ కోసం అంతరిక్షంలో ఆయుధాలను మోహరించామని అమెరికా సోమవారం అధికారికంగా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భవిష్యత్తు యుద్ధాలు నేలపై, నీటిలో, ఆకాశంలో కాదు.. అంతరిక్షంలో జరుగుతాయన్న అంచనాలకు అమెరికా ప్రకటన నిదర్శనంగా నిలిచింది. అమెరికాతో పోటీగా చైనా, రష్యా కూడా అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ వివరాలేవీ బహిరంగంగా వెల్లడించడంలేదు.
అయితే, నేలపై నుంచే మిసైళ్లను ప్రయోగించి అంతరిక్షంలోని ఉపగ్రహాలను కూల్చేసే పరీక్షలను అమెరికా, చైనా, రష్యా ఇదివరకే విజయవంతంగా నిర్వహించాయి. వీటి దారిలోనే భారత్ కూడా అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని కూల్చేసి, మూడు అగ్రదేశాలకు దీటుగా సత్తా చాటింది. కానీ, ఈ మూడు దేశాల మాదిరిగా భారత్ కూడా అంతరిక్షంలో ఆయుధాలు మోహరించి.. స్పేస్ వార్‌కు సిద్ధమవుతున్నదా? అంటే.. ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నాలు జరుగుతున్న దాఖలాలేవీ లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా, కోల్డ్ వార్ కాలం నుంచే అంతరిక్షాన్ని ఆయా దేశాలు యుద్ధరంగంలో భాగంగానే భావిస్తున్నాయి. అమెరికా, రష్యా, చైనా, భారత్‌తో సహా అనేక దేశాలకు కక్ష్యలో ఉపగ్రహాలు ఉన్నాయి.
అమెరికా జీపీఎస్, భారత్ నావిక్ కాన్‌స్టలేషన్స్ వంటి నావిగేషన్ సేవలతో పాటు కమ్యూనికేషన్స్, నిఘా సేకరణ, సైనిక కార్యకలాపాలకు కీలకమైన ఇతర సేవలను అందిస్తున్నాయి. భవిష్యత్తులో స్పేస్ వార్ మొదలైతే.. శత్రు దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా వాటి సైన్యాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసమే ప్రధాన దేశాలు అంతరిక్షంలో శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేయగల ఆయుధాలను(ఉపగ్రహాలను) మోహరించడంలో పోటీపడుతున్నాయి.
1985లోనే అమెరికా ‘అశాట్’ పరీక్ష..
అంతరిక్షంలో శత్రు ఉపగ్రహాన్ని కూల్చివేయడానికి రూపొందించిన ఆయుధాలను (క్షిపణులను) యాంటీ-శాటిలైట్ వెపన్స్ లేదా అశాట్(ఏఎస్‌ఏటీ)లు అని పిలుస్తున్నారు. కోల్డ్ వార్ సమయంలోనే అమెరికా, సోవియెట్ రష్యా వీటి అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. మొట్టమొదటిసారిగా అమెరికా 1985లో అశాట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అమెరికా ఎయిర్ ఫోర్స్ ఎఫ్-15 జెట్ దాదాపు 38,100 అడుగుల (సుమారు 11.6 కిలోమీటర్లు) ఎత్తుకు వెళ్లి.. ఏఎస్ఎం-135 అశాట్ క్షిపణిని ప్రయోగించింది. ఇది భూమికి దాదాపు 555 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న సైంటిఫిక్ ఉపగ్రహాన్ని ఢీకొట్టి ధ్వంసం చేసింది. ఇలా దాడి చేసే ఆయుధాలను కైనెటిక్ డైరెక్ట్ -అసెంట్ అశాట్ అంటారు. వీటి ప్రయోగం చాలా సంక్లిష్టంగా ఉంటుంది.
అంతరిక్షంలో వేగంగా తిరుగుతున్న టార్గెట్‌ను, కక్ష్యను కచ్చితంగా అంచనా వేసేందుకు శక్తివంతమైన రాడార్లు, ఆప్టికల్ సెన్సర్లు అవసరమవుతాయి. అందుకే, ఇంత క్లిష్టమైన టెక్నాలజీని అతికొద్ది దేశాలు మాత్రమే అభివృద్ధి చేయగలిగాయి. 1985 అమెరికా పరీక్ష తర్వాత చైనా 2007లో గ్రౌండ్- లాంచ్డ్ ఇంటర్‌సెప్టర్‌ను ఉపయోగించి ఫెంగ్యున్-1సీ వెదర్ శాటిలైట్‌ను ధ్వంసం చేసింది. రష్యా 2021లో ఇలాంటి పరీక్షలోనే కాస్మోస్-1408 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది.
అలాగే, 2022లో చైనా షిజియాన్-21 ఉపగ్రహాన్ని పరీక్షించింది. ఇది రోబోటిక్ ఆర్మ్‌ను ఉపయోగించి పనిచేయని ఉపగ్రహాన్ని పట్టుకుని దాని కక్ష్యను మార్చింది. శత్రువుల ఉపగ్రహాన్ని మరోచోటకు మార్చడానికి లేదా అంతరాయం కలిగించడానికి ఉపయోగపడే సామర్థ్యం దీనికి ఉంది. రష్యా స్పేస్ -బేస్డ్ న్యూక్లియర్ వెపన్‌ను అభివృద్ధి చేస్తోందని 2024లో నాటి బైడెన్ (అమెరికా) ప్రభుత్వం ఆరోపించింది. ఇది అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండి, ఆపై చుట్టూ ఉన్న ఉపగ్రహాలను నాశనం చేసే పేలుడును విడుదల చేయగలదని తెలిపింది.
రేసులో భారత్ ఎక్కడ?
శత్రువుల ఉపగ్రహాలను కూల్చివేయగల అశాట్ సామర్థ్యాన్ని భారత్ కూడా 2019లో మిషన్ శక్తితో ప్రదర్శించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్ నుంచి మార్చి 27, 2019న పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మార్క్-2 ఇంటర్‌సెప్టర్‌ను ప్రయోగించిన డీఆర్‌డీవో.. లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి అంతకుముందు ఇస్రో పంపిన మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహాన్ని ఢీకొట్టి ధ్వంసం చేసింది.
దీంతో అమెరికా, చైనా, రష్యా తర్వాత.. అంతరిక్షంలో వేగంగా కదిలే వస్తువులను గుర్తించి, ట్రాక్ చేసి, కచ్చితత్వంతో అడ్డగించే సత్తా భారత్‌కు కూడా ఉందని ఈ పరీక్షతో డీఆర్‌డీవో చాటింది. స్పేస్ వార్ గనక వస్తే.. అంతరిక్షంలో నుంచే ఆయుధాలను ప్రయోగించే సత్తా భారత్‌కు లేకపోయినా.. భూమి పైనుంచే మిసైల్స్ ప్రయోగించి శత్రు శాటిలైట్లను కూల్చేసే సత్తా మాత్రం తమకుందని భారత్ ఇదివరకే చాటిచెప్పింది.
