- కాంగ్రెస్ సర్కార్ వచ్చాక 47,440 ఎకరాలు జాబితా నుంచి తగ్గాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై అందరి చిట్టా విప్పుతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 22 ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. 22ఏ జాబితాలో సమస్య ఉన్న భూమి కేవలం 4 లక్షల ఎకరాల్లోనే ఉందని మంత్రి చెప్పారు. మిగిలిన భూమంతా ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి 47,440 ఎకరాల భూమి తగ్గిందని తెలిపారు. తన మామ భూములకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్‌ఓసీ ఇచ్చిందన్న మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై పొంగులేటి స్పందించారు. అసైన్డ్ భూములకు అనుమతులు ఇవ్వడం చట్టబద్ధం కాదని చెప్పారు. ఏ ప్రభుత్వం అలా చేసినా తప్పేనని స్పష్టం చేశారు. ఈ విషయం హరీశ్ రావుకు తెలియదా అని ప్రశ్నించారు.
పల్లా, గంగుల భూములపైనా వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భూదాన్ భూమిని నకిలీ ఎన్‌ఓసీతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మంత్రి ఆరోపించారు. అది కూడా తప్పేనని అన్నారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పొంగులేటి ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఏ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినా అది తప్పేనని స్పష్టం చేశారు.
