సిద్దిపేట సమీపంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని హరీశ్‌రావు రియల్ ఎస్టేట్ దోపిడీకి తెగబడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘రిజర్వాయర్ నిర్మాణం కోసం తొలుత ఇరిగేషన్ శాఖ ద్వారా 4 గ్రామాల్లోని 2,212 ఎకరాల 12 గుంటల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. రామంచ గ్రామ సర్వే నంబర్ 464లో హరీశ్‌రావు కొనుగోలు చేసిన భూములను కాపాడుకునేందుకు.. తుది నోటిఫికేషన్‌లో కేవలం 2,183 ఎకరాల 28 గుంటలు మాత్రమే సేకరించి.. ప్రతిపాదిత 4 ఎకరాల 20 గుంటలకుగానూ కేవలం ఎకరం 29 గుంటలనే సేకరించి మిగిలిన భూమిని భూసేకరణ నుంచి రద్దు చేయించుకున్నారు.
ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఎకరాకు రూ.6.25 లక్షల పరిహారం చెల్లిస్తుంటే, భూ యజమానులను బెదిరించి హరీశ్‌రావు మాత్రం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకే ఆ భూములను తీసుకున్నారు’’ అని ఆరోపించారు. రంగనాయక సాగర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు మున్సిపాలిటీకి సంబంధం లేని వ్యవసాయ భూముల నుంచి సిద్దిపేట మున్సిపల్ కమిషనరేట్ నిధులు రూ.5.33 కోట్లతో ఎలాంటి టెండర్లు, సాంకేతిక అనుమతులు లేకుండా ప్రత్యేకంగా బీటీ రోడ్డు వేయించుకొని స్లిప్పులపై బిల్లులు చెల్లించారని సీఎం తెలిపారు. ఇరిగేషన్ శాఖ సేకరించిన 10 ఎకరాల భూమిని సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా)కి బదిలీ చేయించి, రోడ్డు ముసుగులో వెనుక ఫామ్‌హౌస్ నిర్మించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
