వెలుగు స్పెషల్ : ఆగస్టు 15న స్వేచ్ఛ.. సెప్టెంబరు 17న సమగ్రత! 

వెలుగు స్పెషల్ : ఆగస్టు 15న స్వేచ్ఛ.. సెప్టెంబరు 17న సమగ్రత! 

1947 ఆగస్టు 15న  దేశమంతా సంబురాల్లో మునిగిపోయింది.  ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరింది.  తెల్లదొరల పాలన పోయి భారత్ స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ యావత్ భారత గుండెల్లో ఒక తీరని అసంపూర్తి,   దేశానికి స్వాతంత్ర్యం అయితే వచ్చింది.. కానీ దేశం పూర్తిగా ఒక్కటి కాలేదు. బ్రిటిష్ చట్టం ప్రకారం  565 సంస్థానాలకు స్వతంత్రంగా ఉండే అధికారం వచ్చినా కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్‌‌ తప్ప మిగిలిన అన్ని సంస్థానాలు  భారతదేశంలో  విలీనమయ్యాయి.  భారతదేశం నడిబొడ్డునే ఉన్న అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ మాత్రం భారత యూనియన్‌‌లో చేరబోమని, తాము స్వతంత్రంగా ఉంటామని నిర్ణయించుకుంది.  ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాకపోతే దేశ ఐక్యత అసంపూర్తిగా ఉన్నట్లే.  ఈ అసంపూర్తికి సరిగ్గా పదమూడు నెలల తర్వాత 1948 సెప్టెంబరు 17న ముగింపు పడింది. అది  యావత్ భారత సమగ్రతకు సంపూర్ణత వచ్చిన రోజు.

హైదరాబాద్ మ్యాప్ చూస్తే చుట్టూ భారత భూభాగమే.  మధ్యలో మాత్రం భారత యూనియన్‌‌కు బయట ఒక ప్రత్యేక రాజ్యంగా నిలబడాలనుకుంది. భారత ప్రభుత్వం దీన్ని కేవలం ఒక నిజాం రాజు మొండికేసిన సమస్యగా చూడలేదు.  దేశ రక్షణ,  రైల్వే-,  రోడ్డు రవాణా, అంతర్గత భద్రత, భవిష్యత్ రాజకీయ స్థిరత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయంగా చూసింది.  అందుకే సెప్టెంబరు 17ను  కేవలం ఒక సైనిక చర్య ముగిసిన రోజుగా చూడటం చరిత్రను చాలా చిన్నదిగా చూడటమే. అది భారతదేశ భౌగోళిక స్వరూపం సంపూర్ణమైన ఒక చారిత్రక మలుపు.

వందలాది సంస్థానాల విలీనం జరిగినా..

బ్రిటిష్‌‌వారు వెళ్లిపోయాక వందలాది సంస్థానాలు సజావుగానే భారత యూనియన్‌‌లో చేరిపోయాయి. కానీ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాత్రం ససేమిరా అన్నాడు.  భారత  ప్రభుత్వంతో  'స్టాండ్‌‌స్టిల్' ఒప్పందం చేసుకున్నా తుది పరిష్కారం రాలేదు.  ఒకవేళ హైదరాబాద్ గనుక ప్రత్యేక దేశంగా మిగిలిపోతే ఏం జరిగేది?  దేశ విభజన గాయాలు పచ్చిగానే ఉన్నాయి. పాక్‌తో సంబంధాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.  అటు కాశ్మీర్‌‌లో యుద్ధ వాతావరణం ఉంది. సరిగ్గా అలాంటి సమయంలో భారతదేశం నడిబొడ్డున ఇంకో ప్రత్యేకరాజ్యం ఏర్పడితే దేశభద్రతకు శాశ్వత  కేన్సర్ గడ్డలా మారే ప్రమాదం ఉండేది. అందుకే హైదరాబాద్  సమస్యకు పటేల్ అంత ప్రాధాన్యమిచ్చారు. 

రజాకార్ల ఉన్మాదం

ఖాసిం రజ్వీ నేతృత్వంలోని 'రజాకార్ల' వ్యవస్థ.  మజ్లిస్ --ఇత్తెహాదుల్ ముస్లిమిన్ అండతో ఒక క్రూరమైన ప్రైవేట్ మిలీషియా తయారైంది. నిజాం సర్కారుపై, ఆసిఫ్ జాహీ దర్బారుపై వారి పెత్తనం నడిచింది. నిజాం ప్రధాని లాయక్ అలీ కేవలం నామమాత్రంగా మారితే, రజ్వీ అసలు సిసలు చక్రం తిప్పాడు. నిజాం పాలనలో రజాకార్ల విచ్చలవిడితనం, ప్రజలపై వారి భయానక అరాచకాలు సంస్థానాన్ని అతలాకుతలం చేశాయి. ఇది కేవలం సాధారణ రాజకీయ విభేదం కాదు. ఒకవైపు భారతదేశం ప్రజాస్వామ్యంలోకి అడుగులు వేస్తున్న కాలం, మరోవైపు నిజాం నిరంకుశ పాలన, దానికి అండగా పెరిగిన రజాకార్ల ఆయుధశక్తి. హైదరాబాద్‌‌లో ముస్లిం రాజకీయ ఆధిపత్యాన్ని శాశ్వతంగా కొనసాగించాలన్నదే రజాకార్ల ఉన్మాదం. హైదరాబాద్ సంస్థానంలో ఎనభై శాతానికి పైగా మెజారిటీ ప్రజలు హిందువులే. కానీ అధికార పగ్గాలు, జాగీర్దారీ- వ్యవస్థ,  పరిపాలనా యంత్రాంగం మొత్తం ముస్లిం రాజవంశం చేతుల్లోనే ఉన్నాయి. ఈ అసమానతే తర్వాతి పరిణామాలకు కేంద్రబిందువైంది.  

ముస్లిం ప్రజలపై పోరాటం కాదు

సెప్టెంబరు 17 పోరాటాన్ని  ‘ముస్లింలపై  హిందువుల పోరాటం’గా  చూడటం అత్యంత దారుణం,  చరిత్రకు అన్యాయం. ఇది ముస్లిం ప్రజలపై పోరాటం కాదు,  మతపరమైన ఆధిపత్యాన్ని  కాపాడుకోవాలనుకున్న నిజాం- రజాకార్ వ్యవస్థకు, మతభేదం లేకుండా అందరినీ కలుపుకున్న భారత సైన్యానికి మధ్య జరిగిన నిర్ణాయక పోరాటం. రజాకార్ అంటే ఒక విద్వేష మిలీషియా ముఠాకు చెందిన వ్యక్తి, ముస్లిం అంటే ఈ గడ్డపై జీవించే సాధారణ పౌరుడు. ఈ తేడాను అర్థం చేసుకున్నప్పుడే సెప్టెంబరు 17 అసలు అర్థం తెలుస్తుంది.  

హైదరాబాద్‌‌లో భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌‌గా పనిచేసిన కే.ఎం. మున్షి వర్ణన ఇక్కడ చాలా కీలకం. మున్షి తన 'ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా' రచనలో వాస్తవాలను కళ్లకు కట్టారు. ఆయన దృష్టిలో హైదరాబాద్ సమస్య సాధారణమైనది కాదు.  భారతదేశం కడుపులో ఉన్న ఒక 'కేన్సర్ గడ్డ' లాంటి రాజకీయ కేంద్రం. హైదరాబాద్ భారతదేశంలో విలీనం కాకుండా అలాగే ఉండిపోతే దేశ సమగ్రతకు, భద్రతకు ఎంతటి ముప్పు వాటిల్లేదో ఆయన స్పష్టంగా హెచ్చరించారు.  

సెప్టెంబరు 17 భారత సమగ్రతకు సంపూర్ణత వచ్చిన రోజు

నిజాం ప్రభుత్వం హైదరాబాద్ సమస్యను అంతర్జాతీయ వివాదంగా మార్చే కుట్ర చేసింది. సెప్టెంబరు 12న ఐక్యరాజ్యసమితి తలుపు తట్టి అత్యవసరంగా భారత చర్యను ఆపాలని కోరింది. సెప్టెంబరు 16న భద్రతా మండలి దీనిని తన అజెండాలోకి తీసుకుంది. భారత సైనిక చర్య గనుక ఆలస్యమై ఉంటే ఏమయ్యేది? అంతర్జాతీయ జోక్యం పెరిగి, కాశ్మీర్​లాగ​  హైదరాబాద్ కూడా ఒక శాశ్వత అంతర్జాతీయ వివాదంగా మారి దేశం గుండెల్లో తిష్ఠవేసి ఉండేది.

అందుకే సెప్టెంబరు 17 కేవలం ఒక తేదీ కాదు, అత్యంత కీలకమైన సమయంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయం. చివరకు 1948 సెప్టెంబరు 13న 'ఆపరేషన్ పోలో' (పోలీస్ యాక్షన్) మొదలైంది. నాలుగు రోజుల్లోనే నిజాం సైన్యం కుప్పకూలింది.  సెప్టెంబరు 17న నిజాం లొంగిపోయాడు. సెప్టెంబరు 17న నెహ్రూ చేసిన అంతర్గత నోట్‌‌లోనూ ఇదే స్పష్టమైంది. -ఈ ఆపరేషన్ ద్వారా హైదరాబాద్‌‌పై భారత ప్రభుత్వ సార్వభౌమ అధికారం సుస్థిరమైంది. ఆగస్టు 15న మొదలైన స్వాతంత్ర్య ప్రస్థానానికి సెప్టెంబరు 17 ఒక సంపూర్ణమైన ముగింపునిచ్చింది.  ఆగస్టు 15 భారత స్వాతంత్ర్యానికి పుట్టినరోజైతే.. సెప్టెంబరు 17 భారత సమగ్రతకు సంపూర్ణత వచ్చిన రోజు.  భారతదేశం తన గుండెల్లోని  అసంపూర్తిని శాశ్వతంగా  పూర్తి  చేసుకున్న మహత్తర దినం!

- డా. ప్రకాష్ రెడ్డి,       
బీజేపీ సీనియర్ నాయకుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు 
పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచన 700 పదాలకు మించరాదు.