ట్రస్టుల ఆదాయానికి ఎస్ర్కో ఖాతా.. మైనారిటీ శాఖకు హైకోర్టు ఆదేశం

ట్రస్టుల ఆదాయానికి ఎస్ర్కో ఖాతా.. మైనారిటీ శాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మక్కా మదీనా అల్లాదిన్‌‌‌‌ వక్ఫ్‌‌‌‌, అల్లాదిన్‌‌‌‌ చారిటీస్‌‌‌‌ అండ్‌‌‌‌ జకాత్‌‌‌‌ వక్ఫ్‌‌‌‌, అల్లాదిన్‌‌‌‌ చారిటీస్‌‌‌‌ వక్ఫ్‌‌‌‌, అల్లాదిన్‌‌‌‌ ఎడ్యుకేషనల్‌‌‌‌ ఎండోమెంట్‌‌‌‌ ట్రస్టులకు చెందిన 452 ఆస్తుల అద్దెలు, ఇతర ఆదాయాన్ని జమ చేసేందుకు ఎస్క్రో ఖాతా తెరవాలని మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. 2012లో తమ ఆస్తులను వక్ఫ్‌‌‌‌ బోర్డు పరిధిలో కొనసాగించడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ ట్రస్టులు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌ శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌ విచారణ చేపట్టారు.

పిటిషనర్ల తరపున న్యాయవాది శ్రీపాద ప్రభాకర్‌‌‌‌ వాదనలు వినిపించారు. 2012 జనవరి 17 నుంచి వక్ఫ్‌‌‌‌ బోర్డు ట్రస్టు ఆస్తుల నిర్వహణ చేపట్టిందని, వాటి అద్దెలు, ఆదాయంలో అవకతవకలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. 2025 ఏప్రిల్‌‌‌‌ 8 నుంచి అమల్లోకి వచ్చిన వక్ఫ్‌‌‌‌ చట్ట సవరణతో ట్రస్టుల ఆస్తులు ఆ చట్ట పరిధిలోకి రావని, వాటిని వక్ఫ్‌‌‌‌ బోర్డు పరిధి నుంచి విడుదల చేయాలని న్యాయవాది కోరారు.

పేద ముస్లింల సంక్షేమం కోసం హబీబ్‌‌‌‌ అల్లాదిన్‌‌‌‌ కుటుంబానికి చెందిన ఆస్తులను మక్కా మదీనా అల్లాదిన్‌‌‌‌ వక్ఫ్‌‌‌‌కు కేటాయించారని, వాటిని అద్దెకు ఇచ్చి వచ్చే ఆదాయాన్ని సంక్షేమం కోసం వినియోగిస్తున్నారని వివరించారు. వాదనలు విన్న కోర్టు మైనారిటీ సంక్షేమశాఖ, వక్ఫ్‌‌‌‌ బోర్డు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.