టీవీవీపీలో స్పెషలిస్ట్ డాక్టర్ల సెలెక్షన్ లిస్ట్ రిలీజ్

టీవీవీపీలో స్పెషలిస్ట్ డాక్టర్ల సెలెక్షన్ లిస్ట్ రిలీజ్
  •  కటాఫ్ ర్యాంకులు ప్రకటించిన ఎంహెచ్ఎస్ఆర్బీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల సెలెక్షన్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) బుధవారం విడుదల చేసింది. మొత్తం 17 విభాగాలకు గానూ.. టీజీఎస్ఆర్టీసీలోని 7 విభాగాల్లో కలిపి 1,623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీ ప్రక్రియలో గతంలో రెండు విడతల్లో ఏడు విభాగాల రిజల్ట్ ను బోర్డు విడుదల చేసింది.

మిగిలిన 10 విభాగాలు ఆప్తాల్మాలజీ, ఈఎన్‌‌టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాలకు ఆగస్టు 13 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించి అర్హత పరీక్ష మార్కులు, సర్వీస్ వెయిటేజీ ఆధారంగా మొత్తం 292 మంది అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేశారు.

128 పోస్టులు క్యారీ ఫార్వర్డ్

రిజర్వుడు కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మొత్తం 128 పోస్టులు భర్తీ కాలేదని, వీటిని తదుపరి నోటిఫికేషన్‌‌ కు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. పలు విభాగాల్లో ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ అభ్యర్థులు లేకపోవడంతో ఆయా రోస్టర్ పాయింట్లను నిబంధనల ప్రకారం ఓసీకి కన్వర్ట్ చేసి భర్తీ చేశారు.

సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పెండింగ్‌‌ లో ఉన్న పలువురు అభ్యర్థుల ఫలితాలను తాత్కాలికంగా అబేయన్స్‌‌ లో ఉంచిన బోర్డు, అభ్యర్థుల శారీరక దారుఢ్యం, తదితరాల పరిశీలన సంతృప్తికరంగా ఉంటేనే నియామకాలు ఖరారవుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తూ అదే స్పెషాలిటీలో వెయిటేజీ పొంది ఎంపికైనట్లు తేలితే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని, కోర్టుల్లో పెండింగ్‌‌ లో ఉన్న కేసుల తీర్పులకు లోబడే తుది నియామకాలు ఉంటాయని వెల్లడించింది.