సీసీటీవీ ఫుటేజీని భద్రపరచండి.. కేటీఆర్ పీఏ, పీఆర్వోల పిటిషన్పై హైకోర్టు

సీసీటీవీ ఫుటేజీని భద్రపరచండి.. కేటీఆర్  పీఏ, పీఆర్వోల పిటిషన్పై హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కార్యకర్తలను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో నమోదైన కేసులో విచారణకు హాజరైన కేటీఆర్ పీఆర్వో, మీడియా కోఆర్డినేటర్ మహేశ్ మాణిక్య, వ్యక్తిగత సహాయకుడు మహేందర్‌‌‌‌రెడ్డికి సంబంధించిన విచారణ సమయంలోని సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని హైకోర్టు.. సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. స్టేషన్‌‌‌‌లోకి వచ్చే, వెళ్లే మార్గాలతోపాటు పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిసరాల్లోని సీసీటీవీ రికార్డులను భద్రపరచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు పిటిషనర్లు హాజరయ్యే సమయంలో తగిన రక్షణ కల్పించాలని సూచించింది.

ఈ నెల 14న సాయంత్రం విచారణకు వెళ్లినప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు తమను బెదిరించి, దాడికి ప్రయత్నించారని ఆరోపిస్తూ మహేశ్ మాణిక్య, మహేందర్‌‌‌‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని వారి తరఫు న్యాయవాది టి.వి. రమణరావు కోర్టుకు తెలిపారు. దీనిపై అధికారికంగా విచారణ జరిపించాలని కోరారు.

హోంశాఖ తరఫున జీపీ వాదిస్తూ.. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో డీజే ఏర్పాటుకు అనుమతి కోసం కొందరు స్టేషన్‌‌‌‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని, పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌‌‌‌ టి. మాధవీదేవి.. పోలీసులను కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ఆదేశించారు. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.