జన్వాడ ఫామ్‌‌‌‌హౌస్ వెనుక చీకటి ఒప్పందాలు: సీఎం రేవంత్ రెడ్డి 

జన్వాడ ఫామ్‌‌‌‌హౌస్ వెనుక చీకటి ఒప్పందాలు: సీఎం రేవంత్ రెడ్డి 

జన్వాడలోని కేటీఆర్‌‌ ఫామ్‌‌హౌస్‌‌ పుట్టుపూర్వోత్తరాలను, దానికి సత్యం స్కాం నిందితులతో ఉన్న చీకటి ఒప్పందాలను సీఎం బయటపెట్టారు. గతంలో తాను పార్లమెంట్‌‌ సభ్యుడిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఫామ్‌‌హౌస్‌‌ను ప్రజలకు చూపించేందుకు వెళ్తే  డ్రోన్లతో బాంబులు వేసి కేటీఆర్‌‌ను చంపడానికి వచ్చానంటూ తనపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని గుర్తుచేశారు.

"కేటీఆర్‌‌ ఏమైనా ఒసామా బిన్‌‌ లాడెనా? ఆయనపై డ్రోన్లతో బాంబులు వేయడానికి? ఆయన రోడ్డు మీద వెళ్తే పిచ్చి కుక్క కూడా కరవదు.. ఆయనపై బాంబులు వేయాల్సిన అవసరం మాకేంటి?" అని సీఎం అన్నారు. జన్వాడ సర్వే నంబర్‌‌ 301లోని ఆ భూమి గతంలో సత్యం కంప్యూటర్స్‌‌ కుంభకోణంలో నిందితుడైన సత్యం రామలింగరాజుకు చెందిన శతభిష ఆగ్రో ప్రైవేట్‌‌ లిమిటెడ్, డీఆర్‌‌బీఆర్‌‌ ఆగ్రో ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీల పేరిట ఉండేదని, ఐటీ శాఖ ఆ ఆస్తులను సీజ్‌‌ చేసి అటాచ్‌‌మెంట్‌‌లో పెట్టిందన్నారు. 2015లో ఆ ఆస్తులు కేటీఆర్‌‌ వర్గానికి బదిలీ అయ్యాయని, 2019 మార్చి, జులైలో సర్వే నంబర్లు 301/6, 301/7, 301/8లోని భూములను కేటీఆర్‌‌ తన భార్య శైలిమ పేరిట మార్చుకున్నారని చెప్పారు. 2021 జనవరి 22న 
డాక్యుమెంట్‌‌ నంబర్‌‌ 232132 ద్వారా కేటీఆర్‌‌ మామ హరినాథరావు, అత్త శశిరేఖల పేర్లకు మారిపోయాయని తెలిపారు. 2019, 2020లలో ధరణి కాంట్రాక్టులు కట్టబెట్టే టైంలోనే  ఈ క్విడ్‌‌ప్రోకో బదిలీలు జరిగాయన్నారు.