పద్మారావునగర్, వెలుగు: నగరంలోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో బోధనకు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్, కామర్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయన్నారు.
సంబంధిత సబ్జెక్టులో పీజీ విభాగంలో కనీసం 55 శాతం మార్కులు(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) సాధించిన వారు అర్హులని తెలిపారు. నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాల పీజీ కార్యాలయంలో తమ అప్లికేషన్లను ఇవ్వాలని పేర్కొన్నారు. 19న ఉదయం 10 గంటలకు కాలేజీలోనే ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.
