ఇందిరమ్మ టవర్స్ అప్లికేషన్ ట్రాన్స్ఫర్కు అవకాశం.. సెప్టెంబర్ 20 లాస్ట్ డేట్

ఇందిరమ్మ టవర్స్ అప్లికేషన్ ట్రాన్స్ఫర్కు అవకాశం.. సెప్టెంబర్ 20 లాస్ట్ డేట్

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి హౌసింగ్ బోర్డు మరో సువర్ణావకాశం కల్పించింది. ఈ ఏడాది జూలై నెలలో 16 నియోజకవర్గాల్లో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. ప్రస్తుతం ఎల్బీ నగర్, గోషామహాల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో నివసిస్తున్నట్లయితే.. తమ పాత దరఖాస్తును తాము ప్రస్తుతం ఉంటున్న నియోజకవర్గానికి బదిలీ చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు.

ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు.. తమ పాత దరఖాస్తు వివరాలతో  హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌‌‌‌సైట్  https://tghb.telangana.gov.in/cure-status  ద్వారా ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు బదిలీకి అప్లై చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి ప్రస్తుతం నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే దరఖాస్తు బదిలీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ బదిలీ ప్రక్రియ అనేది నివాస ధ్రువీకరణ పత్రంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన అన్ని అర్హతలు, నిబంధనల పరిశీలనకు లోబడి ఉంటుందని వైస్ చైర్మన్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు ఎవరూ కొత్తగా లేదా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను సమర్పించకూడదన్నారు. కేవలం పాత దరఖాస్తును మాత్రమే బదిలీ చేసుకోవాలని కోరారు.