ఝీరాం ఘాటీ ఘటనలో.. 10 మంది మావోయిస్టులకు ఉరిశిక్ష

ఝీరాం ఘాటీ ఘటనలో.. 10 మంది మావోయిస్టులకు ఉరిశిక్ష
  • 13 ఏండ్ల నాటి కేసులో ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు
  • 2013లో మావోయిస్టుల దాడి
  • కాంగ్రెస్ స్టేట్ చీఫ్, 29 మంది మృతి

న్యూఢిల్లీ: ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని ఝీరాం ఘాటీలో 13 ఏండ్ల క్రితం జరిగిన మావోయిస్టుల మెరుపు దాడి కేసులో స్పెషల్​ నేషనల్​ఇన్వెస్టిగేషన్​ఏజెన్సీ(ఎన్ఐఏ) కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ అగ్రనేతలతో సహా 29 మంది మృతికి కారణమైన 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష ఖరారు చేసింది. 2013 మే 25న ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ బస్తర్ జిల్లాలోని దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝీరాం ఘాటీలో కాంగ్రెస్ పార్టీ ‘పరివర్తన ర్యాలీ’ ముగించుకుని తిరిగి వస్తున్న కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌‌‌‌పై మావోయిస్టులు మెరుపు దాడి జరిపారు.

ఈ ఘటనలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్, అసెంబ్లీలో ప్రతిపక్ష మాజీ నేత మహేంద్ర కర్మ, కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్‌‌‌‌తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు మరణించారు. వీరితో పాటు భద్రతా సిబ్బంది, సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. 

ఈ కేసుకు సంబంధించి మొత్తం 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ నెల ప్రారంభంలో జగదల్‌‌‌‌పూర్‌‌‌‌లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు స్పెషల్​జడ్జి అభయ్ సింగ్ రాజ్‌‌‌‌పుత్ ఇద్దరు మహిళలతో సహా మొత్తం 10 మందిని దోషులుగా తేల్చారు. బుధవారం వెలువరించిన ఈ తీర్పులో దోషులుగా తేలిన 10 మందికి మొత్తం 24 అభియోగాల్లో 7 అభియోగాల కింద మరణశిక్షను ఖరారు చేస్తూ, రూ. 800 చొప్పున జరిమానా విధించారు.

ఎన్ఐఏ దర్యాప్తుపై రాజకీయ దుమారం..

సీపీఐ (మావోయిస్టు) నిషేధిత సంస్థకు చెందిన సాయుధ కేడర్లు స్థానిక విభాగాలతో కలిసి పరివర్తన ర్యాలీ కాన్వాయ్‌‌‌‌పై దాడి చేసేందుకు పక్కా పన్నాగం పన్నినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అయితే, ఈ దాడి వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బాఘెల్ తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.