బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కూడా ఈ భూ ఆక్రమణల్లో ఎవరికీ తీసిపోలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 1954–55 రెవెన్యూ పహాణీ రికార్డుల ప్రకారం సర్కారు భూమిగా ఉన్న సర్వే నంబర్లు 151/1, 151/2లలోని 10 ఎకరాల 36 గుంటల ప్రభుత్వ భూమిని కొమరయ్య ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. ‘వీఐఎఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ ముసుగులో ఈ విలువైన సర్కారు భూమిని కబ్జా చేశారని ఆధారాలు చూపారు.
ఈ కబ్జా పర్వంలో బీజేపీ ఎమ్మెల్సీకి ఒక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూడా పూర్తిస్థాయిలో తోడయ్యారని వెల్లడించారు. ‘‘అసెంబ్లీ బయట ప్రత్యర్థులుగా నటిస్తూ.. లోపల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఏ విధంగా అంటకాగుతున్నారో ప్రజలు గమనించాలి. అందుకే ఈ సర్వే నంబర్ల భూముల రికార్డులను, వారిద్దరి అక్రమ భాగస్వామ్యాన్ని సభ దృష్టికి తెస్తున్నాను’’ అని స్పష్టం చేశారు.
