సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అత్యుత్తమ స్థాయిలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం, మెరుగైన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్, శాంతిభద్రతలు రాష్ట్రానికి బలమైన అంశాలని పేర్కొన్నారు. తెలంగాణ పెట్టుబడిదారులను ప్రభుత్వం ‘సంపద సృష్టికర్తలు’గా భావిస్తోందని తెలిపారు. బుధవారం హెచ్‌ఐసీసీలో జరిగిన 25వ సీఐఐ- ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్- 2026 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి హాజరై మాట్లాడారు. ‘మెరుగైన మోటార్లు, సమర్థవంతమైన శీతలీకరణ వ్యవస్థలు, ఇంధన సామర్థ్య భవనాలు, మెరుగైన పారిశ్రామిక ప్రక్రియలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు.
ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్‌ను శాశ్వతంగా తగ్గించగలిగితే మొత్తం విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది’ భట్టి తెలిపారు. మనం ఉత్పత్తి చేసే విద్యుత్ యూనిట్ కంటే అవసరం లేకుండా పొదుపు చేసే కరెంట్ యూనిటే చౌకైనది అని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ పరిరక్షణ అంశంగా కాకుండా ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహంగా చూడాలని సూచించారు. పీక్ పవర్ డిమాండ్ తగ్గితే ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు, తయారీ రంగం, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి
ఉందన్నారు.
డిసెంబర్‌లో గ్లోబల్ సమ్మిట్
ఈ ఏడాది డిసెంబర్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరు కావాలని కోరారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఏఐ వంటి సాంకేతికతలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సెన్సర్ల ద్వారా ఎక్కడ విద్యుత్ వృథా అవుతుందో గుర్తించవచ్చని, డిజిటల్ వ్యవస్థలతో పారిశ్రామిక ప్రక్రియలను మెరుగుపరచవచ్చని చెప్పారు. మానవ ఆపరేటర్లు గుర్తించలేని నమూనాలను కూడా ఏఐ గుర్తించగలదన్నారు.
