- మొత్తం 700 ఎకరాలకు కంచె వేసి సాగు చేస్తుండ్రు
- సర్వే నంబర్ 325లోని సర్కారు జాగా ఎక్కడుంది
- 30 రోజుల్లో విచారణ చేసి గుర్తించి లెక్క తేల్చండి
- అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
- 800 మంది దళితులకు ఆ భూమిని పంచుతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేద దళితులకు పంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఫామ్‌హౌస్ వెనుక దశాబ్దాల నాటి భూవివాదాలు, రికార్డుల తారుమారు బాగోతం ఉందని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో 22ఏపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘1944 సర్వే రికార్డుల ప్రకారం ఎర్రవల్లి గ్రామాన్ని ఆనుకొని 2,447 ఎకరాల భూమి ఉంది. దీని సరిహద్దులో శివార్ వెంకటాపురం గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల సరిహద్దుల మధ్య దాదాపు 300 ఎకరాల భూమి రెండు గ్రామాల రికార్డుల్లోనూ (ఓవర్ ల్యాపింగ్) నమోదై ఉంది.
ఈ భూమి ఏ గ్రామానిదన్న వివాదం 1957 నుంచి నలుగుతోంది. ఈ వివాదాస్పద భూమిపై ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ కన్నుపడింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్‌లో రికార్డులను తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఆ 300 ఎకరాలు కొనుగోలు చేసినట్టు కాగితాలు సృష్టించి, ఒక్క కలం పోటుతో కేసీఆర్ఆ భూమికి యజమాని అయిపోయారు’’ అని వివరించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వాస్తవ విస్తీర్ణం, అందులో కలిసిన ప్రభుత్వ అసైన్డ్ భూమి లెక్కలు తేల్చాలన్నారు.
‘‘ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులందరి పేర్ల మీద రికార్డుల ప్రకారం ఉన్నది 295 ఎకరాల భూమి మాత్రమే. కొనుక్కున్న భూమి ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతంలోని సర్వే నంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఉంది. 2017లో ల్యాండ్ రికార్డ్స్ డిలీషన్, అప్‌డేషన్ పేరిట అనేక అక్రమ మార్పులు చేసి ఈ అసైన్డ్ భూమిని రికార్డుల నుంచి మాయం చేశారు. ఈరోజు అధికారిక రికార్డుల్లో ఉన్న 295 ఎకరాలు కాకుండా, ఎలాంటి రికార్డులు లేని ఈ 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా చుట్టూ కంచె వేసి కలిపేసుకుని దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నది పచ్చి నిజం కాదా? ఈ 700 ఎకరాల ఫామ్‌హౌస్ మీ భౌతిక ఆధీనంలో ఉన్నదా లేదా? దీనికి కేసీఆర్ సభకు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
దళితులకే ఇస్తం..
గతంలో ఫామ్‌హౌస్ ఎదుట దళితులకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నదని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘‘గతంలో తమ హక్కుల సాధన కోసం దళిత సోదరులు ఫామ్‌హౌస్ ముందు డప్పు కొట్టి నిరసన వ్యక్తం చేస్తే.. ఫామ్‌హౌస్ రోడ్లపై పసుపు నీళ్లు చల్లించి శుద్ధీకరణ పేరు మీద దళితుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశారు.
దళితులను అవమానించిన అదే ఫామ్‌హౌస్ సాక్షిగా కేసీఆర్ ఆధీనంలో ఉన్న ఆ 388 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఏ దళితులనైతే గేట్ల బయట నిలబెట్టి పసుపు నీళ్లు చల్లి అవమానించారో.. అదే స్థలంలో 800 మంది దళిత కుటుంబాలకు భూమి పంపిణీ చేస్తాం. ఫామ్‌హౌస్‌ను ఆనుకొని 800 మంది దళితులను శాశ్వత భూ యజమానులుగా మారుస్తాం. వారు అక్కడే నివసించేలా, వారికి నచ్చినప్పుడల్లా దర్జాగా డప్పు దరువేసుకునే హక్కులు కల్పిస్తాం. మాది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు’’ అని స్పష్టం చేశారు.
తక్షణమే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సమర్పించాలి
ఈ భూఆక్రమణపై తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభ నుంచే ఆదేశించారు. ‘‘నేను ఈ సభ వేదిక నుంచే రెవెన్యూ శాఖకు, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నా. తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయాలి. ఆయన కొనుగోలు చేసిన రిజిస్టర్డ్ భూమి ఎంత? అక్కడ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న మొత్తం భూమి ఎంత? సర్వే నంబర్ 325లో ఉండాల్సిన 388 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందో నిజ నిర్ధారణ కమిటీ (ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) అక్కడికి వెళ్లి తక్షణమే తేల్చాలి.
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాం. రెవెన్యూ అధికారులకు సరిగ్గా 30 రోజుల సమయం ఇస్తున్నాం. ఈ 30 రోజుల్లోగా పని చేసి ఈ భూమి లెక్క తేల్చకపోతే సంబంధిత అధికారులు మాత్రమే కాదు, బాధ్యులైన మంత్రులపై కూడా నేను చర్యలు తీసుకుంటా. ఈ విషయంలో ఎవరినీ క్షమించే సమస్యే లేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
