న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో మంగళవారం సాయంత్రం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారత యుద్ధనౌకను పాకిస్తాన్ షిప్ ఢీకొట్టింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న టైంలో పాకిస్తాన్‌కు చెందిన నౌక ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రమాదకర రీతిలో దూసుకొచ్చి గస్తీ నిర్వహిస్తున్న భారత యుద్ధనౌకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు దేశాల నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని.. ఘటన తర్వాత రెండు నౌకలు దూరంగా వెళ్లాయని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది పూర్తిగా నిర్లక్ష్యపూరిత ప్రవర్తనగా పేర్కొంది. వెంటనే ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో 'ఛార్జ్ డి అఫైర్స్ (తాత్కాలిక రాయబారి)' గా బాధ్యతలు నిర్వహిస్తున్న సాద్ అహ్మద్ వరాచ్‌ను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించింది. ఘటనపై సుమారు 30 నిమిషాలపాటు ఆయనతో అధికారులు చర్చించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఇరుదేశాల మధ్య ఒప్పందాల్లోని నిబంధనలను గౌరవించేలా సంబంధిత పాక్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. పాక్ నౌకాదళం వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదని, అది అత్యంత అనాలోచితమైన చర్య అని స్పష్టం చేయడంతోపాటు సమన్లు కూడా జారీ చేశారు. దీనిపై ఇస్లామాబాద్‌లోని భారత రాయబారి కూడా పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసన తెలియజేయాలని ఆదేశించారు.
