- గోరీ బ్యూటీ క్రీమ్, చాందిని క్రీమ్ వాడొద్దని సీడీఎస్ సీవో హెచ్చరిక
నాగ్పూర్: పాకిస్తాన్ తయారీ 'గోరీ బ్యూటీ క్రీమ్' వాడకం నాగ్‌పూర్‌లో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రీమ్ వాడిన 18 మంది మహిళలు, బాలికలు కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. స్థానిక బ్యూటీ పార్లర్లు, మార్కెట్లలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్న ఈ క్రీమ్‌ను పరీక్షించగా.. సురక్షిత స్థాయికంటే 100 నుంచి 105 రెట్లు అధికంగా 'పాదరసం' ఉన్నట్లు తేలింది. బాధితుల్లో మూత్రంలో అధిక ప్రోటీన్ పోవడం, ముఖం, కాళ్ల వాపులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నెఫ్రాలజిస్టులు తెలిపారు.
కిడ్నీ బయాప్సీలో కొందరికి 'మెంబ్రానస్ నెఫ్రోపతి' నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో 'గోరీ బ్యూటీ క్రీమ్', 'చాందిని' క్రీమ్‌లను దిగుమతి చేసుకోవడం, అమ్మకంపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా నిషేదం విధించింది. అనధికారిక సౌందర్య ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాపులు, మూత్రంలో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
