డబ్బు లేనిదే ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టలేని రోజులివి. ప్రతి చిన్న అవసరానికి, పూట గడవడానికి కరెన్సీ నోట్లే ఆధారం. కానీ ఆస్ట్రేలియాకు చెందిన జో నెమెత్ అనే 56 ఏళ్ల మహిళ మాత్రం గత 15 ఏళ్ల నుంచి డబ్బు, బ్యాంక్ అకౌంట్, ఆస్తిపాస్తులు లేకుండానే ప్రశాంతంగా జీవిస్తోందట. వినటానికి షాకింగ్ గా అనిపిస్తున్నప్పటికీ.. సమాజంలో పేరుకుపోయిన విపరీతమైన వినియోగం, ఆర్థిక ఒత్తిళ్లకు వ్యతిరేకంగానే ఆమె ఈ దారిని ఎంచుకుని ప్రశాంతంగా జీవిస్తున్నా అంటోంది.
న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన జో నెమెత్.. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కెరీర్‌ను వదిలేసి.. 2015లో పూర్తిగా డబ్బు లేకుండా జీవించచాలనే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన వద్ద ఉన్న డబ్బులన్నింటినీ కూతురు అమీకి ఇచ్చేసి, తన బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేసుకున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు, ఎప్పుడూ జీతం కోసం ఎదురుచూసే ఆందోళన ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయట. మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు కార్మికుల కష్టాలను, పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాయో తెలుసుకుని ఆమె చలించిపోయారు. మార్క్ బోయిల్ రాసిన 'ది మనీలెస్ మ్యాన్' పుస్తకం ఆమె ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందట.
డబ్బును వదిలేసిన తర్వాత ఆమె తన అవసరాలు ఏమిటో 10 నిమిషాల్లోనే ఒక లిస్ట్ రెడీ చేసుకుంది. టూత్‌బ్రష్, వంట పాత్రలు వంటి కనీస వస్తువులు మినహా తనకు పెద్దగా ఏదీ అవసరం లేదని గ్రహించింది. ఇక అక్కడి నుంచి 'గిఫ్ట్ ఎకానమీ' విధానాన్ని ఎంచుకున్నారు. అదే నండి పాత కాలంలో మాదిరిగా వస్తు మార్పిడి అన్నమాట. తన స్నేహితులు ఇచ్చే అదనపు ఆహారాన్ని స్వీకరిస్తూ, బార్టరింగ్ పద్ధతిని పాటిస్తూ జీవిస్తున్నారు. ఉదాహరణకు దంత వైద్యం అవసరమైనప్పుడు.. టోఫు, ఆపిల్-స్క్రాప్ వెనిగర్ ఎలా తయారు చేయాలో నేర్పించడం ద్వారా తన నైపుణ్యాలను ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్నారు.
తొలినాళ్లలో స్నేహితుల పొలంలో పనికిరాని వస్తువులతో చిన్న ఆశ్రయం కట్టుకుని బతికిన ఆమె.. ప్రస్తుతం షారన్ బ్రోడీ అనే స్నేహితురాలి ఇంట్లోని ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నారట. ఇక్కడ ఆమె ఎలాంటి అద్దె చెల్లించకుండా.. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, కూరగాయల తోటను చూసుకోవడంతో పాటు సబ్బులు, డిటర్జెంట్లు స్వయంగా తయారు చేస్తూ కుటుంబానికి సాయపడుతున్నారు. కారుకు బదులుగా నడక, సైక్లింగ్ వంటివి ఉపయోగిస్తున్నారు.
ALSO READ : ప్రజాస్వామ్యాన్ని చంపేసినందుకు హ్యాపీ బర్త్‌డే మోడీ జీ
డబ్బు లేకపోతే భద్రత ఉండదనే భయానికి భిన్నంగా.. మానవ చరిత్రలో నిజమైన భద్రత సమాజంతో కలిసి జీవించడంలోనే ఉంటుందని నెమెత్ నిరూపిస్తున్నారు. తోటివారికి సహాయం చేస్తూ.. సామాజిక కరెన్సీని సంపాదించుకుంటున్నానని, జీతం తీసుకునే రోజుల కంటే ఇప్పుడే తాను ఎంతో సంతోషంగా, సేఫ్ గా ఉన్నానని ఆనందంగా చెబుతున్నారు.
