20 ఏళ్ల తర్వాత భారీగా తగ్గిన వరి దిగుబడి.. బియ్యం రేట్లకు రెక్కలు!

20 ఏళ్ల తర్వాత భారీగా తగ్గిన వరి దిగుబడి.. బియ్యం రేట్లకు రెక్కలు!

దాదాపు 20 ఏళ్ల తర్వాత భారతదేశంలో వరి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. పంట చేతికి వచ్చే కీలక సమయంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దిగుబడిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తి, ఎగుమతి చేస్తున్న దేశంగా ఉన్న ఇండియాలో ఈ పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వర్షాభావంతో పడిపోనున్న దిగుబడి:
ఈ ఏడాది రుతుపవనాల్లో సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా వరి సాగు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో లోటు ఏకంగా 42 శాతానికి చేరుకుంది. దీనివల్ల దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో పంట దిగుబడి భారీగా తగ్గనుంది. గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 10 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి తగ్గొచ్చని 'రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు బి.వి. కృష్ణారావు వెల్లడించారు. 

దేశీయంగా పెరిగిన ధరలు:
వరి దిగుబడి తగ్గుతుందనే అంచనాల కారణంగా దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు ఇప్పటికే క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఇతర ఎగుమతి దేశాలలో కూడా ధరలు పెరుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ బియ్యం మరింత ప్రియంగా మారుతున్నాయి. నాణ్యమైన వరి రకాలను సాగు చేస్తున్న రైతులకు ఓపెన్ మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

►ALSO READ | కిచెన్ బడ్జెట్‌ తలకిందులు: ఉల్లి నుంచి వంటనూనె వరకూ భగ్గుమంటున్నాయ్.. తిండికి తిప్పలే!

గత ప్రభుత్వ నిల్వలే రక్ష:
ఉత్పత్తి తగ్గినప్పటికీ.. గత సంవత్సరాల రికార్డు సేకరణ స్టోరేజ్ కారణంగా ప్రభుత్వం వద్ద భారీ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 1 నాటికి ప్రభుత్వ గిడ్డంగి నిల్వలు 59.6 మిలియన్ టన్నులకు చేరాయి. ఇది అక్టోబర్ 1 నాటికి నిర్దేశించుకున్న 10.3 మిలియన్ టన్నుల లక్ష్యానికంటే చాలా ఎక్కువ. ఈ భారీ నిల్వల కారణంగా ఎలాంటి ఎగుమతి ఆంక్షలు విధించాల్సిన అవసరం రాదని.. భారత్ తన ఎగుమతులను యథావిధిగా కొనసాగించవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.