ప్రముఖ మల్టీప్లెక్స్ దిగ్గజం PVR INOXకి ఊహించని షాక్ తగిలింది. నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నందుకు బెంగళూరు సౌత్ సిటీ కార్పొరేషన్ సీరియస్ అయింది. నిర్లక్ష్యంగా వ్యవహారించిన యాజమాన్యానికి ఏకంగా రూ. 75 వేలు తక్షణ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని స్పాట్ లోనే రికవరీ చేశారు అధికారులు.
అసలేం జరిగింది?
బిటిఎమ్ లేఅవుట్ నియోజకవర్గ పరిధిలోని హొసూర్ మెయిన్ రోడ్డులో ఉన్న PVR INOX థియేటర్‌లో బెంగళూరు సౌత్ సిటీ కార్పొరేషన్ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) నిబంధనలను ఘోరంగా ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. తడి, పొడి చెత్తను వేరు చేయకుండా రెండింటినీ కలిపి వేయడంతో పాటు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో చెత్తను వేరుచేయకుండా రెండింటినీ కలిపి వేసినందుకు రూ. 50 వేలు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినందుకు రూ. 25 వేలు జరిమానా వేశారు.
ఫోరమ్ మాల్‌కు ఫైన్..
ఈ స్పెషల్ డ్రైవ్‌లో కేవలం మల్టీప్లెక్స్‌లే కాకుండా పెద్ద పెద్ద మాల్స్ కూడా బుక్కయ్యాయి. కనకపుర మెయిన్ రోడ్డులోని ఫోరమ్ మాల్ (Forum Mall) నుంచి వెలువడే మురుగునీటి శుద్ధి ప్లాంట్ (STP) వ్యర్థాలను జయగర్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లోని ఒక సూపర్ మార్కెట్ సమీపంలో పారబోస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దాంతో మాల్ యాజమాన్యానికి అక్కడికక్కడే రూ.50,839 ఫైన్ వేశారు.
అధికారుల వార్నింగ్..
ఈ చర్యలపై స్పందించిన కార్పొరేషన్ కమిషనర్ కేఎన్ రమేష్, బల్క్ వేస్ట్ జనరేట్ చేసే మాల్స్, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు ఖచ్చితంగా సైంటిఫిక్ పద్ధతిలో చెత్తను డిస్పోజ్ చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజూ వేల టన్నుల చెత్తను ఉత్పత్తి చేసే బెంగళూరు నగరంలో.. ఇలాంటి ప్రముఖ వ్యాపార సంస్థల నిర్లక్ష్యమే డ్రైనేజీలు బ్లాక్ అవ్వడానికి, రోడ్లపై చెత్త పేరుకుపోవడానికి కారణమవుతోందని ప్రజలు మండిపడుతున్నారు. బిబిఎమ్‌పి తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో మిగతా కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో ఇప్పుడు గుబులు మొదలైంది..
