సీఎం రేవంత్ ఆర్డర్స్.. కేసీఆర్ ఫాం హౌస్ భూఆక్రమణలపై రంగంలోకి రెవెన్యూ శాఖ

సీఎం రేవంత్ ఆర్డర్స్.. కేసీఆర్ ఫాం హౌస్ భూఆక్రమణలపై రంగంలోకి రెవెన్యూ శాఖ

గజ్వేల్: కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్ భూముల వ్యవహారంలో అధికారులు విచారణ మొదలుపెట్టారు. గజ్వేల్ ఆర్డీఓ, మర్కుక్ ఎమ్మార్వో, ఏడీ సుదర్శన్ ఆధ్వర్యంలో భూముల పరిశీలన కొనసాగుతుంది. ఎర్రవల్లి, శివారు వెంకటపూర్, వరదరాజుపూర్ గ్రామాల సరిహద్దుల్లోని 325 సర్వే నెంబర్లో అసైన్డ్ భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. 325 సర్వే నెంబర్లోని అసైన్డ్ భూమి గురించి ఆరా తీశారు.

కేసీఆర్ ఫాం హౌస్ పేరుతో చేసిన భూఆక్రమణలపై తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని  సీఎం రేవంత్‌‌రెడ్డి శాసనసభ నుంచే ఆదేశించిన మరుసటి రోజే రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. 

రెవెన్యూ అధికారులకు సరిగ్గా 30 రోజుల సమయం ఇస్తున్నామని, ఈ 30 రోజుల్లోగా పని చేసి ఈ భూమి లెక్క తేల్చకపోతే సంబంధిత అధికారులు మాత్రమే కాదు, బాధ్యులైన మంత్రులపై కూడా నేను చర్యలు తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

కేసీఆర్ ఫాం హౌస్ గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘1944 సర్వే రికార్డుల ప్రకారం ఎర్రవల్లి గ్రామాన్ని ఆనుకొని 2,447 ఎకరాల భూమి ఉంది. దీని  సరిహద్దులో  శివార్​ వెంకటాపురం  గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాల సరిహద్దుల మధ్య దాదాపు 300 ఎకరాల భూమి రెండు గ్రామాల రికార్డుల్లోనూ (ఓవర్​ ల్యాపింగ్) నమోదై ఉంది. ఈ భూమి ఏ గ్రామానిదన్న వివాదం 1957 నుంచి నలుగుతోంది.  ఈ వివాదాస్పద భూమిపై ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్‌ కన్నుపడింది.

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, ల్యాండ్‌ రికార్డ్స్‌ అప్‌డేషన్‌లో  రికార్డులను  తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఆ 300 ఎకరాలు కొనుగోలు చేసినట్టు కాగితాలు సృష్టించి, ఒక్క కలం పోటుతో కేసీఆర్​ఆ భూమికి  యజమాని అయిపోయారు’’ అని వివరించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వాస్తవ విస్తీర్ణం, అందులో కలిసిన  ప్రభుత్వ అసైన్డ్‌ భూమి లెక్కలు తేల్చాలన్నారు.

►ALSO READ | అసెంబ్లీ దగ్గర ఓవరాక్షన్ ఇష్యూ: రెండోసారి విచారణకు కేటీఆర్ పీఏ, పీఆర్వో

‘‘ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్‌‌లో కేసీఆర్‌‌ కుటుంబ సభ్యులందరి పేర్ల మీద రికార్డుల ప్రకారం ఉన్నది 295 ఎకరాల భూమి మాత్రమే. కొనుక్కున్న భూమి ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ  ప్రాంతంలోని సర్వే నంబర్‌‌ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ అసైన్‌‌మెంట్‌‌ భూమి ఉంది. 2017లో ల్యాండ్‌‌ రికార్డ్స్‌‌ డిలీషన్, అప్‌‌డేషన్‌‌ పేరిట అనేక అక్రమ మార్పులు చేసి ఈ అసైన్డ్‌‌ భూమిని రికార్డుల నుంచి మాయం చేశారు.

ఈరోజు అధికారిక రికార్డుల్లో ఉన్న 295 ఎకరాలు కాకుండా, ఎలాంటి రికార్డులు లేని ఈ 388 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా చుట్టూ కంచె వేసి కలిపేసుకుని దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో  సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నది పచ్చి నిజం కాదా? ఈ 700 ఎకరాల ఫామ్‌‌హౌస్‌‌ మీ భౌతిక ఆధీనంలో ఉన్నదా లేదా? దీనికి కేసీఆర్​ సభకు, రాష్ట్ర ప్రజలకు  సమాధానం చెప్పాలి’’ అని  సీఎం రేవంత్​ రెడ్డి సవాల్ విసిరారు.