టాటా గ్రూప్‌లో నెలకొన్న పరిణామాలు, అంతర్గత సంక్షోభం మధ్య టాటా సన్స్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో జరిగిన సమావేశంలో ఎన్. చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మరో 5 ఏళ్ల కాలం కొనసాగేందుకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. వాస్తవానికి మరో టర్మ్ కోరబోనని చంద్రశేఖరన్ గత నెలలో రాజీనామా సమయంలో ప్రకటించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు ఆయనను కొనసాగించాలని నిర్ణయం తీసుకోవటం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
ఈ నిర్ణయం వెనుక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా.. కొత్త నాయకత్వ అన్వేషణ ప్రారంభించాలని కోరారు. చంద్రశేఖరన్ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటూ వారసుడి ఎంపిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే బోర్డు మీటింగ్‌లో నోయెల్ టాటా అభిప్రాయాన్ని మెజారిటీ సభ్యులు తోసిపుచ్చడంతో పరిస్థితులు, నిర్ణయాలు పూర్తిగా ఛేంజ్ అయ్యాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. టాటా సన్స్ లిస్టింగ్ అంశంపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. కంపెనీని అప్పర్-లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరించినందున లిస్టింగ్ చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దీనికి మొగ్గు చూపగా, టాటా ట్రస్ట్స్ మాత్రం ప్రారంభంలో వ్యతిరేకిస్తూ వచ్చింది. తాజా బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ పునర్నియామకానికి ఆమోదం లభించినప్పటికీ.. కంపెనీ లిస్టింగ్‌పై మాత్రం ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
►ALSO READ | బైక్స్‌కు ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కొట్టరా..? బంకుల్లో కొత్త పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్
ఈ పరిణామంతో టాటా గ్రూప్‌లో కొద్ది రోజులుగా నడుస్తున్న నాయకత్వ అనిశ్చితికి తాత్కాలికంగా తెరపడినట్లైంది. 2017 నుంచి ఛైర్మన్‌గా సేవలందిస్తున్న చంద్రశేఖరన్ నాయకత్వంలోనే టాటా సన్స్ మళ్లీ ముందుకుసాగనుంది. నాన్-బెంచ్‌మార్క్ డెసిషన్స్‌తో దూసుకెళ్తున్న టాటా గ్రూప్‌లో ఈ పరిణామాలు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
