బైక్స్‌కు ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కొట్టరా..? బంకుల్లో కొత్త పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్

బైక్స్‌కు ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కొట్టరా..? బంకుల్లో కొత్త పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్

వాహనదారులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలనే నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిబంధన అమలుకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న పాత టూవీలర్ల ఓనర్లకు కొత్త కష్టాలు మెుదలు కాబోతున్నాయి. పెట్రోల్ కావాలంటే ఇన్సూరెన్స్ పాలసీ తప్పక కొనసాగిందే ఇకపై.

కొత్త విధానం ప్రకారం పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కెమెరాల సహాయంతో వాహనాల నంబర్లను స్కాన్ చేస్తారు. ఆ వాహనానికి సరైన థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వాహన్ డేటాబేస్‌ల ద్వారా క్షణాల్లో గుర్తిస్తారు. ఇన్సూరెన్స్ పాలసీ లేని వాహనాలు గుర్తిస్తే వాటికి పెట్రోల్, డీజిల్ అమ్మరు. 

ప్రస్తుతం దేశంలో దాదాపు 56 శాతం వాహనాలు అంటే మెుత్తం 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాల్లో 16.54 కోట్లు వాహనాలకు సరైన ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్నట్లు సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖతో కలిసి IRDAI ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీతో పాటు ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో తొలుత ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నారు.

ఈ విధానం సక్సెస్ అయితే.. సాధారణ ఇన్సూరెన్స్ రంగానికి ఇది టర్నింగ్ పాయింట్ కానుంది. చట్టబద్ధమైన థర్డ్-పార్టీ కవరేజ్ కోసం ఇన్సూరెన్స్ లేని కోట్లాది వాహనాలు ఫార్మల్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. FY26 డేటా ప్రకారం ఐసీఐసీఐ లాంబార్డ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ వంటి టాప్ కంపెనీలు మోటార్ ప్రీమియం ద్వారా భారీ వ్యాపారాన్ని కలిగి ఉన్నాయి. 

ALSO READ : శ్రీదేవి ఆస్తిపై లీగల్ వార్.. బోనీ కపూర్, జాన్వీలకు సుప్రీంకోర్టు నోటీసులు!

ఈ సిస్టమ్ విజయవంతం కావడానికి ఇన్సూరెన్స్ సంస్థలు తమ పాలసీ జారీ, రెన్యూవల్ డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. పెట్రోల్ బంక్ డీలర్లు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో టెక్నాలజీని అనుసంధానించడమే ఈ ప్రాజెక్ట్ ముందున్న అసలు సవాల్. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రోడ్డు భద్రత మరింత మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు.