కొండచిలువలు జంతువులతో పాములను కూడా తినడం మాములే. కానీ.. ఒక నాగుపాము కొండచిలువను తినడం చూశారా..? అవును కర్ణాటకలో జరిగింది ఈ ఘటన. 12 అడుగుల కింగ్ కోబ్రా కొండచిలువను మింగేసింది. సెప్టెంబర్ 11న కర్ణాటకలోని బెల్తంగడి మండలంలో తెంకాకరందూర్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఓ వ్యక్తి తన తోటలో 12 అడుగుల కింగ్ కోబ్రాను చూసి స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగుపామును పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా అప్పటికే మింగిన కొండచిలువను కక్కేసింది. ఇది చూసిన స్నేక్ క్యాచర్ సహా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.
అయితే... కింగ్ కోబ్రా కొండచిలువను మింగటం కొత్తేమీ కాదని అంటున్నారు స్నేక్ క్యాచర్. కింగ్ కోబ్రాలు ఇతర పాములను వేటాడటంలో ఎక్స్ పర్ట్స్ అని... వాటి ఆహారంలో విషపూరితమైన, విషరహితమైన పాములు రెండూ ఉంటాయని అన్నారు. పాములను తినే పాముల్లో నాగుపాములు, కట్ల పాములు, రాట్ స్నేక్స్, కొండచిలువలు ఉన్నాయని తెలిపారు.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము అని, కొన్ని పాములు ఐదు మీటర్లకు పైగా పెరగగలవని అన్నారు. ఇతర పాములను ఎదుర్కొన్నప్పుడు దాని పరిమాణం దానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, అదే సమయంలో దాని విషం ఎరను పూర్తిగా మింగే ముందు దాన్ని లొంగదీసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు స్నేక్ క్యాచర్.
పాముల పుర్రెకు మాత్రమే ఉండే ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఒక పాము మరొక పామును తినగలదని అంటున్నారు స్నేక్ క్యాచర్స్. మనుషుల లాగా పాములకు దవడలు కలిసిపోయి ఉండవు కాబట్టి ఎంత పెద్ద జంతువులనైనా మింగగల ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని అన్నారు. పెద్ద జంతువులను తిన్న తర్వాత చాలా సేపటి వరకు ఏమి తినకుండా ఉండగలవని అంటున్నారు.
