హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్‌ను బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. హాకీంపేట దగ్గర పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, దురుసుగా ప్రవర్తించిన కేసులో గురువారం (సెప్టెంబర్ 17) రాత్రి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర అతన్ని అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బొల్లారం పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో సైఫాబాద్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మహేష్ ను సైఫాబాద్ పీఎస్ లోనే విచారించాలని కోర్టు ఆదేశించిందంటూ బొల్లారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోకుండా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దళిత సంఘాలు సెప్టెంబర్ 8న ఎర్రవల్లిల్లోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిని అడ్డుకునేందుకు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హాకీంపేట దగ్గర బొల్లారం పోలీసులు అడ్డుకున్నారు. ఫామ్ హౌస్ దగ్గర లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడే అవకాశం ఉండటం వల్ల బీఆర్ఎస్ నాయకులను వెళ్లొద్దని పోలీసులు వారించారు.
ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణమూర్తిపై కేటీఆర్ పీఆర్వో మహేష్ దురుసుగా ప్రవర్తించాడు. మహేష్ తోసివేయడంతో ఏసీపీ కిందపడిపోయాడు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించి, తనపై దురుసుగా ప్రవర్తించడాని మహేష్‌పై ఏసీపీ బొల్లారం పోలీసులకు ఏసీపీ ఫిర్యాదు చేశాడు. ఏసీపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్ 17) మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
