హ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్: ప్రధాని మోడీ జార్జియా మెలోని విషెస్

హ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్: ప్రధాని మోడీ జార్జియా మెలోని విషెస్

న్యూఢిల్లీ: 77వ వసంతంలోకి అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధినేతలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మోడీకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

‘‘నా మిత్రుడు నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆరోగ్యం, శక్తి, విజయం కలగాలని కోరుకుంటున్నాను. ఇటలీ, భారతదేశం తమ గాఢమైన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, మన దేశాల కోసం సహకారం, శ్రేయస్సుతో కూడిన భవిష్యత్తును కలిసి నిర్మిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్  వంటి దేశాధినేతలు సైతం మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

77వ వసంతంలోకి మోడీ

1950, సెప్టెంబరు 17న జన్మించిన మోడీ.. నేటితో 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగపెట్టారు. బీజేపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మోడీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఆపై ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2001, అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్‎లో వరుస ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించి  13 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన చేశారు. 

►ALSO READ | హిందీ వద్దంటే కుదరదు: తమిళనాడుకు సుప్రీం ఆదేశం

ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన మోడీ 2014  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించి.. 2014,  మే 26న తొలిసారిగా భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ నేతృత్వంలో 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఎన్డీఏ కూటమి వరుస విజయాలు నమోదు చేసింది. 2024, జూన్ 9న వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధాని అయిన రెండో నాయకుడిగా రికార్డు సృష్టించారు.