అభిషేక్ ఊచకోత.. సంజు ఫిఫ్టీ: ఆఫ్ఘన్‌పై టీమిండియా రికార్డు స్కోర్.. టార్గెట్ ఎంతంటే?

అభిషేక్ ఊచకోత.. సంజు ఫిఫ్టీ: ఆఫ్ఘన్‌పై టీమిండియా రికార్డు స్కోర్.. టార్గెట్ ఎంతంటే?

IND vs AFG 3rd T20: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 221 పరుగుల స్కోరు సాధించింది. సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియన్ టీమ్, ఆఫ్ఘన్ బౌలర్లను ఆరంభం నుంచే చెడుగుడు ఆడుకుంది.

అభిషేక్ రికార్డు శతాకం.. సంజు ధమాకా: 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.

అభిషేక్ శర్మ (108) కిరాక్ బ్యాటింగ్: తొలి బంతి నుంచే బ్యాట్ ఝలిపించిన అభిషేక్ శర్మ, కేవలం 30 బంతుల్లోనే శతకం కొట్టి రికార్డు సృష్టించడమే కాకుండా మొత్తం 108 పరుగులతో ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. తన ఇన్సింగ్స్ లో 11 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. 

సంజు శాంసన్ (50) క్లాస్ ఫిఫ్టీ: మరోవైపు ఓపెనర్ సంజు శాంసన్ ఆరంభం నుంచి బాధ్యతాయుతమైన ఆటతీరుతో అర్ధ సెంచరీ (50 రన్స్) సాధించి, ఓపెనింగ్ వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సందర్భంగా టీ20ల్లో 9,000 పరుగుల మైలురాయి దాటిన ఉత్సాహంలో ఈ సిరిస్ లో వరుసగా సంజు రెండో హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 

ముగ్గురు రనౌట్.. వరుసగా పడిన వికెట్లు:

ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత భారత ఇన్నింగ్స్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

రనౌట్ల గందరగోళం: టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్ల మధ్య సమన్వయం లోపించడంతో ఏకంగా ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు రనౌట్ అయ్యారు. దీంతో స్కోరు వేగం కాస్త మందగించింది.

ఆఫ్ఘన్ బౌలింగ్: ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 2 వికెట్లు తీయగా, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, అరంగేట్రం చేసిన అబ్దుల్లా అహ్మద్‌జాయ్ తలో వికెట్ పడగొట్టారు.

ఆఫ్ఘనిస్థాన్ టార్గెట్ 222 పరుగులు: 

20 ఓవర్లలో 221 రన్స్ సాధించిన భారత్, ఆఫ్ఘనిస్థాన్ ముంగిట 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే 0–2 తేడాతో సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘన్ సేనకు ఢిల్లీ పిచ్‌పై ఈ భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం అసాధ్యమనే చెప్పాలి.. జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్‌లతో కూడిన భారత బౌలింగ్ విభాగాన్ని దాటుకుని ఆఫ్ఘన్ ఎంతవరకు పోరాడుతుందో అనేది చూడాల్సి ఉంది. 

►ALSO READ | ఆఫ్ఘన్‌పై రచ్చ.. టీ20ల్లో 9000 రన్స్ బాదిన సంజు: కోహ్లీ, రోహిత్ క్లబ్‌లోకి శాంసన్