కేసీఆర్ మనుమడు, మనుమరాలికి.. 56.21 ఎకరాల జాగా

కేసీఆర్ మనుమడు, మనుమరాలికి.. 56.21 ఎకరాల జాగా
  • హిమాన్షు పేరిట 46.23, అలేఖ్య పేరిట 9.38 ఎకరాలు
  • ఇద్దరు పిల్లల పేరిటే యాభై ఎకరాల పైబడి భూమి
  • సీలింగ్ యాక్టు ప్రకారం ఉండాల్సింది 27 ఎకరాలే
  • ఇంత భూమి ఎక్కడిది.. ఏం వ్యాపారం చేశారు: సీఎం 

కేసీఆర్ కొడుకు కేటీఆర్ పిల్లల పేర్ల మీదే ఏకంగా 56.21 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబ్లీలో రెవెన్యూ, ధరణి అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ చట్టం నిబంధనలను, కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల అధికారిక రికార్డుల వివరాలను సభలో స్వయంగా చదివి వినిపించారు.

కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరిట నమోదై ఉన్న వ్యవసాయ భూముల అధికారిక రికార్డులను సభకు వివరించారు. కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు రావు పేరుపై 46.23 ఎకరాల భూమి, కూతురు కల్వకుంట్ల ఆలేఖ్య పేరుపై 9.38 ఎకరాల భూమి నమోదై ఉందని వివరించారు. కేవలం ఈ ఇద్దరు పిల్లల పేర్ల మీదే మొత్తం 56.21 ఎకరాల జాగా రికార్డుల్లో ఉందని చెప్పారు. వీరితోపాటు కేటీఆర్ పేరిట 49.20 ఎకరాలు, ఆయన భార్య కే. శైలిమ పేరిట 17.20 ఎకరాల భూమి ఉందని వెల్లడించారు.

కుటుంబానికి ఉండాల్సింది 27 ఎకరాలే.. 

అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ నిబంధనలను సభలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి గుర్తుచేశారు. చట్టం ప్రకారం భార్య, భర్త, అవివాహిత పిల్లలు అందరూ కలిపి ఒకే కుటుంబ యూనిట్ కిందకు వస్తారని స్పష్టం చేశారు. సీలింగ్ చట్టం రూల్స్ ప్రకారం ఒక కుటుంబ యూనిట్‌‌కు ఖుష్కీ పొలం అయితే గరిష్టంగా 54 ఎకరాలు, తరి పొలం అయితే గరిష్టంగా 27 ఎకరాలు మాత్రమే ఉండాలని తెలిపారు. కేటీఆర్, ఆయన భార్య శైలిమ, పిల్లలు ఆలేఖ్య, హిమాన్షు రావు అందరిదీ కలిపి ఒకే ఫ్యామిలీ యూనిట్ అని, వీరి పేరిట మొత్తం కలిపి 123. 21 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి  లెక్క తేల్చారు.  

సీలింగ్ చట్టం ప్రకారం 27 ఎకరాల భూమి మాత్రమే ఉండాల్సిన కేటీఆర్ కుటుంబం వద్ద 123.21 ఎకరాల భూమి ఎలా ఉందని నిలదీశారు. ఇంత భూమి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘ఏ వ్యాపారం చేసి ఈ భూములు కొన్నారు? ఎక్కడ సంపాదించారు? ఈ ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయి?’’ అనేది సమాధానం చెప్పాలని  సభ సాక్షిగా డిమాండ్ చేశారు.