హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. సత్యమేవ జయతే అంటూ హైకోర్టు తీర్పును స్వాగతించారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించిందన్నారు. పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దానంపై హైకోర్టు అనర్హత వేటు
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌పై పోటీ చేసినప్పటి నుంచి దానం శాసన సభ సభ్యత్వం (2024, ఏప్రిల్ 23)పై అనర్హత వర్తిస్తుందని కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దానంపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది.
అసలేం ఏం జరిగిందంటే..?
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో పాటు, సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేశాడని.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అతడిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
విచారణ అనంతరం బీఆర్ఎస్ ఫిర్యాదును స్పీకర్ కొట్టివేశారు. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం 2026, ఆగస్టు 21న తీర్పును కోర్టు రిజర్వు చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, తీర్పు సిద్ధం కాకపోవడంతో 18న ప్రకటించింది.
ALSO READ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు
పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. దానంపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాడా.. లేక ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా అనేది స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
