Jr NTR: 22ఏ భూముల వ్యవహారం.. జూ.ఎన్టీఆర్ కూడా బాధితుడేనా..?

Jr NTR: 22ఏ భూముల వ్యవహారం.. జూ.ఎన్టీఆర్ కూడా బాధితుడేనా..?

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యల్లో.. టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రావడం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఈదులనాగులపల్లి పరిధిలోని భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ క్రమంలో ఆ భూములతో జూ.ఎన్టీఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ వ్యవహారంలో ఆయన కూడా బాధితుడేనా? అసలు ఈ భూముల వివాదం వెనుక ఉన్న కథేంటి? ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ప్రస్తుతం విచారణకు సంబంధించిన అంశాలే కాగా.. అవి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇంతకీ జూ.ఎన్టీఆర్ పేరు ఈ భూముల వ్యవహారంలోకి ఎలా వచ్చింది? అనేది పూర్తి వివరాలు ఇలా..

150 ఎకరాల భూములపై ఆరోపణలు..

సర్వే నంబర్లు 134, 135లోని ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డుల్లో గతంలో అక్రమ మార్పులు జరిగాయని నవీన్ యాదవ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. కోర్టు స్టే ఉన్న సమయంలోనూ రికార్డులను మార్చి, సుమారు 150 ఎకరాలకు నకిలీ పట్టాలు సృష్టించారన్నది ఆయన ఆరోపణ. అనంతరం ఆ భూములను పలువురికి విక్రయించారని, అందులో జూ.ఎన్టీఆర్ పేరు కూడా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Jr.ఎన్టీఆర్ కూడా బాధితుడేనా?

అసెంబ్లీలో నవీన్ యాదవ్ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో.. ఆయనకు ఈ భూముల వ్యవహారంపై పూర్తి సమాచారం ఎలా అందిందన్న చర్చ మొదలైంది. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌తో పాటు సినీ వర్గాల్లో చాలాకాలంగా పరిచయాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఎన్టీఆర్ భూముల కొనుగోలుకు సంబంధించిన వివరాలు కూడా ఎమ్మెల్యేకు తెలిసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు అధికారిక విచారణతోనే తేలాల్సి ఉంది.

మరికొందరి పేర్లు కూడా బయటకు వస్తాయా?

ఈ అంశం కేవలం ఒక్క భూమి వ్యవహారానికే పరిమితం అవుతుందా? లేక ఇలాంటి లావాదేవీల్లో మరికొందరు కూడా బాధితులుగా ఉన్నారా? అన్న చర్చ మొదలైంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంకరపల్లి, ఏదులనాగులపల్లి, మొకిల, గండిపేట వంటి ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా భూముల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతరులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అలాంటి ఆస్తుల్లో ఏవైనా వివాదాస్పద భూములు ఉన్నాయా అనే విషయం అధికారిక రికార్డుల పరిశీలనతోనే తేలాల్సి ఉంటుంది.

22ఏ భూములపై గవర్నమెంట్ ఫోకస్..

ఇదిలా ఉండగా.. తెలంగాణలో 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూముల యాజమాన్య హక్కులు, నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్ భూములు, రికార్డుల్లో తలెత్తిన సమస్యలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పట్టణ భూముల క్రమబద్ధీకరణకు కొత్త విధానం తీసుకురావడంతో పాటు, రిజిస్ట్రేషన్–రెగ్యులరైజేషన్‌కు సంబంధించి కొత్త విధానాలను రూపొందిస్తామని కూడా ప్రభుత్వం వెల్లడించింది.

ALSO READ : Missing Meghana Review: మిస్సింగ్ కేసు నుంచి మిస్టరీ థ్రిల్లర్‌గా..

విచారణతోనే అసలు నిజాలు వెలుగులోకి..

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ సమగ్ర ప్రక్షాళనతో పాటు 22ఏ భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాలపై విచారణకు చర్యలు చేపట్టింది. ఈదులనాగులపల్లి భూముల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగితే.. సర్వే నంబర్లు 134, 135కు సంబంధించిన అసలు రికార్డులు ఏమిటి? కాలక్రమంలో భూముల స్వభావం ఎలా మారింది? రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరిగాయి? వాటిని కొనుగోలు చేసిన వారికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయా? వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ వ్యవహారంలో జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే అధికారిక విచారణ పూర్తయి, సంబంధిత రికార్డులు పరిశీలించిన తర్వాతే ఈ వ్యవహారంలో వచ్చిన ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది క్లారిటీ రావాల్సి ఉంది.