నందిగ్రామ్ బైపోల్‎లో బిగ్ ట్విస్ట్.. పోటీ నుంచి TMC అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‎కు మమతా సపోర్ట్

నందిగ్రామ్ బైపోల్‎లో బిగ్ ట్విస్ట్.. పోటీ నుంచి TMC అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‎కు మమతా సపోర్ట్

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ గుర్తు, పేరును వాడకుండా ఈసీ ఫ్రీజ్ చేయగా.. తాజాగా దీదీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మమతా నేతృత్వంలోని టీఎంసీ నుంచి నందిగ్రామ్ ఉప ఎన్నిక బరిలో నిలిచిన సంచితా ప్రధాన్ డే అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. 

సీఎం సువేందు అధికారితో భేటీ అనంతరం నందిగ్రామ్ ఉప ఎన్నికలో టీఎంసీ తరుఫున తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు సంచితా ప్రధాన్ డే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగ్రామ్ ఉప ఎన్నికలో టీఎంసీ పోటీ చేయకుండా కాంగ్రెస్‎కు మద్దతు ఇస్తుందని ప్రకటించారు. మరో ఉప ఎన్నిక రెజినగర్‎పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టీఎంసీకి భయపడే బీజేపీ కుట్రలు చేస్తోందని దీదీ ఫైర్ అయ్యారు.

‘‘నందిగ్రామ్‌లో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నాము. ఇది దేశ ఉన్నత ప్రయోజనాల కోసమే. రెజినగర్ విషయం తర్వాత నిర్ణయిస్తాను. అస్సాంలోని నాగావ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కూడా మేం పోటీ చేయడం లేదు. అక్కడి కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

ప్రాణాలు పోయే వరకు నాతోనే టీఎంసీ:

టీఎంసీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో బెంగాల్ ఉప ఎన్నికలకు ఆ పార్టీ గుర్తు, పేరును కేంద్ర ఎన్నికల సంఘం హోల్డ్‎లో పెట్టింది. నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల కోసం మమతా, రితబత్రా వర్గాలకు వేర్వేరు గుర్తులు, పేర్లు కేటాయించింది. ఈ అంశంపై మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. టీఎంసీకి భయపడే టీఎంసీ గుర్తు, పేర్లను ఈసీతో కుమ్మక్కై బీజేపీ హోల్డ్‎లో పెట్టించిందని ఆరోపించారు. 

►ALSO READ | మెడికల్ షాపులపై CCTV నిఘా.. కొత్త రూల్ తీసుకొస్తున్న మోడీ సర్కార్!

ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని పేర్కొన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన  తాను తలవంచబోనని, లొంగిపోబోనని, పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తప్పకుండా తిరిగి పుంజుకుంటానని అన్నారు. తాను ప్రాణాలతో ఉన్న రోజులు టీఎంసీ నాతోనే ఉంటది.. ఈ విషయం వాళ్లకు తెలియదన్నారు. బీజేపీ దేశం నుంచి వెళ్లిపోవాలని తాను బలంగా కోరుకుంటున్నానని మమతా బెనర్జీ అన్నారు.