తిమ్మారెడ్డి పల్లి: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. తిమ్మారెడ్డిపల్లి రాజు రహదారిపై ట్రాక్టర్పై వెళ్తున్న కూలీలను సిద్దిపేట డిపో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఇక.. మరో ప్రమాదంలో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది.
నార్సింగి నుంచి ఇబ్రహీం బాగ్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళ్తున్న TS07HA0565 నంబర్ గల ఇన్నోవా క్రిస్టా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ఎదురుదిశలో ఉన్న షాపుల్లోకి కారు దూసుకెళ్లడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.
షాపులు ధ్వంసం కాగా, ప్రమాదం ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? లేక ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ లేదా మరేదైనా కారణమా? అనే కోణాల్లో గోల్కొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
