మంచిర్యాల: వరుస ఎన్నికల్లో ఓడిపోయినా అయ్యా కొడుకులకు బుద్ధి రాలేదని కేసీఆర్, కేటీఆర్లపై పెద్దపల్లి ఎంపీ వంశీ ఫైర్ అయ్యారు. శుక్రవారం (సెప్టెంబర్ 18) ఎంపీ వంశీ మంచిర్యాల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ యువతను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటుందని విమర్శించారు. ఖబర్దార్ కేటీఆర్ ఇక నీ ఆటలు సాగవని హెచ్చరించారు. నీళ్ళు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు.
1500 మంది విద్యార్థుల బలిదానాల మీద కుర్చీ వేసుకుని కూర్చున్న వ్యక్తి కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని గ్లోబరిన సంస్థ తో కుమ్మక్కై 25 మంది ఇంటర్ స్టూడెంట్స్ మృతికి కేటీఆర్ కారణం అయ్యాడని ఆరోపించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ నిరుద్యోగ యువకులను మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు ఎకరాల భూమి తప్ప ఇల్లు కూడా లేదన్న కేటీఆర్‌కు 10 ఏళ్ల తర్వాత 1000 ఎకరాల భూములు, కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని అన్నాడు. యువకులు, విద్యార్థులతో కేసీఆర్, కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని.. కేసులు అయితే తప్ప హీరోలు కాలేరు అంటూ యువతను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
►ALSO READ | జన్వాడ ఫాం హౌస్ భూమి నాదే.. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు: ప్రదీప్ రెడ్డి
కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా TOMCOM సంస్థ ద్వారా తన తండ్రి, మంత్రి వివేక్ వెంకటస్వామి ముందుకెళ్తున్నారని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎంపీ లాడ్స్ నుంచి కోటి 50 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. కాకా స్ఫూర్తితో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతానని పేర్కొన్నారు.
