ఢిల్లీ మెట్రో నయా రికార్డ్ సృష్టించింది. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (DTC) ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా బస్సులు బంద్ కావడంతో ఢిల్లీ జనం మెట్రో రైళ్ల బాట పట్టారు. సెప్టెంబర్ 17న ఒక్కరోజే ఢిల్లీ మెట్రో రైళ్లలో 82 లక్షల 44 వేల 903 మంది ప్రయాణికులు ప్రయాణం చేశారని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
DMRC Records Highest-Ever Passenger Boardings of 82,44,903 on 17th September 2026.#DelhiMetro pic.twitter.com/Nu6eNMGM1b
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) September 18, 2026
ఢిల్లీ మెట్రో చరిత్రలోనే తొలిసారి ఇన్ని లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించడం విశేషం. 2025 ఆగస్ట్ 8న రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఢిల్లీ మెట్రో రైళ్లలో 81 లక్షల 87 వేల 674 మంది ప్రయాణించారు.
ఈ రికార్డ్ సంవత్సరం తర్వాత బద్ధలైపోయింది. DMRC, నోయిడా-గ్రేటర్ నోయిడా కారిడార్, గురుగ్రామ్ రాపిడ్ మెట్రో లైన్‌తో సహా.. 303 స్టేషన్లతో సుమారు 416 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నెట్‌వర్క్‌లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆపరేషనల్ డిమాండ్ ఆధారంగా ఎనిమిది అదనపు రైళ్లను నడుపుతున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.
వేతనాల పెంపు, వైద్య, సామాజిక భద్రతా ప్రయోజనాలతో సహా పలు డిమాండ్లను లేవనెత్తుతూ ఢిల్లీ రవాణా సంస్థ (DTC)లో పనిచేస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. దీంతో.. నాలుగు రోజులుగా ఢిల్లీలో బస్సులు రోడ్డెక్కిన పరిస్థితి లేదు.
వేలాది బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో.. రాణి ఖేరా, రాజ్‌ఘాట్, నెహ్రూ ప్లేస్, బురారీ, వజీర్‌పూర్, ఘుమన్‌హేరా, సరితా విహార్ సహా పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై ఒత్తిడి పెరిగింది. మెట్రోకు ఈ సమ్మె కలిసొచ్చింది.
