కోర్టు ధిక్కరణ కేసులో మున్సిపల్ కమిషనర్కు శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో  మున్సిపల్ కమిషనర్కు శిక్ష

హైదరాబాద్‌‌, వెలుగు: కోర్టు ధిక్కరణ కేసులో కోస్గి మున్సిపల్ కమిషనర్​ సి.శశిధర్​కు హైకోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో వారం జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై అప్పీలుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది. నారాయణపేట జిల్లా కొస్గి మండలం సర్వే నంబర్‌‌ 1806లోని 198.61 చదరపు గజాల స్థలంలో ఆర్‌‌. మురళీధర్‌‌ టిన్‌‌ షెడ్‌‌ నిర్మించి ఐస్‌‌క్రీమ్‌‌ పార్లర్‌‌, ఆన్‌‌లైన్‌‌ కేంద్రం నిర్వహిస్తున్నారు. 

దానిని కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించడంతో 2019లో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అదే ఏడాది మే 22న నిర్మాణాన్ని తొలగించవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ 2024 ఫిబ్రవరి 4న మున్సిపల్‌‌ అధికారులు జేసీబీలతో షెడ్‌‌ను కూల్చివేశారు. కూల్చివేత సమయంలో పిటిషనర్‌‌ కోర్టు ఉత్తర్వులను చూపించినప్పటికీ చర్య కొనసాగించడాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, కమిషనర్‌‌ ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను ధిక్కరించినట్లు నిర్ధారించి శిక్ష విధించింది. ఇదే కేసులో మరో ప్రతివాది కొస్గి తహసీల్దార్‌‌పై దాఖలైన ధిక్కరణ కేసును హైకోర్టు కొట్టివేసింది.