సియోల్: డేవిస్ కప్ క్వార్టర్‌ఫైనల్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇండియా టెన్నిస్ జట్టు.. సౌత్ కొరియాతో కీలక మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి క్వాలిఫయింగ్ రౌండ్–2 పోరు జరగనుంది. తొలి సింగిల్స్‌లో కొరియా నంబర్‌వన్ ప్లేయర్ సూన్వో కువోన్‌తో దక్షిణేశ్వర్ సురేశ్ తలపడనున్నాడు. గత ఫిబ్రవరిలో నెదర్లాండ్స్‌పై ఇండియా గెలవడంలో సురేశ్ కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. సియోల్ కోర్టు నెమ్మదిగా ఉండటం, బాల్స్ బరువుగా మారుతుండటంతో సురేశ్ దూకుడు ఆటతీరుకు కఠిన పరీక్షగా మారనుంది. రెండో సింగిల్స్‌లో ఇండియా టాప్ ప్లేయర్ సుమిత్ నగాల్.. హ్యోన్ చుంగ్‌ను ఎదుర్కోనున్నాడు. గాయాల కారణంగా చుంగ్ ర్యాంక్ పడిపోయినా అతని అనుభవం కొరియాకు ప్రధాన బలం కానుంది.
డబుల్స్ పోరులో ఎన్. శ్రీరామ్ బాలాజీతో కలిసి నికీ పునాచా బరిలోకి దిగనున్నాడు. గాయంతో యూకీ బాంభ్రీ తప్పుకోవడంతో పునాచా చివరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఫైనల్–8 చేరని ఇండియా, కొరియాలో ఈసారి ఆ అడ్డంకిని దాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 1996 తర్వాత ఇండియా ఇప్పటి వరకు క్వార్టర్స్ చేరలేదు.
