హనుమకొండ, వెలుగు: వరంగల్ నగర నడిబొడ్డున దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని లష్కర్ సింగారం దళితులు గురువారం హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1954 నుంచి లష్కర్ సింగారంలో దళితులు ఎవరు చనిపోయినా పోచమ్మకుంట శ్మశానవాటికలోనే దహన సంస్కారాలు నిర్వహించుకుంటున్నామన్నారు.
కానీ ఈ నెల 1న తీగల ప్రదీప్ మరికొందరు శ్మశాన వాటిక స్థలాన్ని జేసీబీతో చదును చేసి, ఖనీలు పాతారని చెప్పారు. గతంలో కూడా ఇలాగే కబ్జాకు ప్రయత్నించారని, ఆ సమయంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే ఆక్రమణలు తొలగించారన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కబ్జాకు తెగబడుతున్నారని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.
కార్యక్రమంలో లీడర్లు ఎర్ర మహేందర్, మట్టెడ అనిల్ కుమార్, కిన్నెర సుధాకర్, బొక్క రవీందర్, సిల్వర్ భిక్షపతి, చెరుకూరి శ్యామ్ చందు, ఎర్ర అరుణ్, దామెర అరుణ్ పాల్గొన్నారు.
