వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ పీహెచ్‌సీ పరిధిలోని చాకిరేవులు గొత్తి కోయగూడెంలో తిమ్మాపూర్ పల్లె దవాఖాన డాక్టర్ చందన ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గూడేనికి 10 కిలోమీటర్లు ట్రాక్టర్ పై, 2 కిలోమీటర్లు కాలినడకన చేరుకొని గిరిజనులకు వైద్యం అందించారు.
శిబిరంలో 52 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. నలుగురు గర్భిణులకు పరీక్షలు నిర్వహించి, పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, అత్యవసర వైద్యం కోసం సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, ఆరోగ్య కార్యకర్తలు శోభ, సుశీల, మోతీలాల్, ఆశా కార్యకర్తలు మాధవి, కవిత తదితరులు పాల్గొన్నారు.
