పర్వతగిరి(గీసుగొండ, సంగెం), వెలుగు: పేదల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. వరంగల్జిల్లా గీసుగొండ 15,16,17 డివిజన్ల ప్రజలకు కొనయామాకుల రైతువేదికలో, సంగెం రైతు వేదికలో 93 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్ పేదలకు అండగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు కనీసం సీఎంఆర్‌ఎఫ్ నిధులు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ బిల్లులను కూడా మంజూరు చేశామని అన్నారు.
నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో చెరువులో పడి చనిపోయిన గీసుగొండ మండలం బాలయ్యపల్లికి చెందిన రాగిరి గణేశ్, నల్ల సిద్ధార్థ డెడ్‌బాడీల వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
