హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, ఇక్కడి రెసిడెన్షియల్ విద్యావిధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని తుర్కియే దేశ ప్రతినిధులు మసూద్ ఓనర్, నూరుల్లా ప్రశంసించారు. భారత విద్యా రంగాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్ వచ్చిన వారు.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ లో సమగ్ర శిక్ష ఏఎస్‌పీడీ శ్రీహరితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకం, మధ్యాహ్న భోజనం, కేజీబీవీలు సహా రెసిడెన్షియల్ స్కూళ్ల పనితీరును అధికారులు వారికి వివరించారు. అనంతరం తుర్కియే ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ దేశంలో ఉండే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెసిడెన్షియల్ విద్యా విధానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న మోడల్‌ను టర్కీలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం గొప్ప పరిణామమన్నారు.
పీఆర్‌టీయూ ఆఫీసులో సింపోజియం
టర్కీ ప్రతినిధుల పర్యటనలో భాగంగా పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సింపోజియం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు దేశాల విద్యా విధానాలు, బాలికా విద్య, ఇంగ్లీష్ మీడియంపై చర్చించారు. అనంతరం ప్రతినిధుల బృందం రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో విద్యాబోధనను పరిశీలించింది.
ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీయూ అధ్యక్షులు అశ్వినీకుమార్, సెక్రటరీ జనరల్ సీఎల్ రోజ్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, ఉపాధ్యక్షురాలు గీత తదితరులు పాల్గొన్నారు.
