హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మరో నిండు ప్రాణం బలయ్యింది. హైదరాబాద్‌లోని ప్రముఖ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్ నగర్‌లోని పార్సిగుట్టకు చెందిన మనోజ్ కుమార్ అనే యువకుడు.. తన బైక్‌ను వీఎస్టీ బ్రిడ్జ్ పైకి తీసుకువచ్చి అక్కడ పార్క్ చేశాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్‌ను బైక్ పైనే ఉంచి, క్షణికావేశంలో బ్రిడ్జ్ పైనుంచి కిందికి దూకడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని మనోజ్ కుమార్‌గా గుర్తించారు. తన చావుకు ఎలాంటి అప్పులు కారణం కాదని, తాను గాఢంగా ప్రేమించిన అమ్మాయే తన ఆత్మహత్యకు కారణమంటూ మనోజ్ తన మొబైల్ ఫోన్‌లో సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్‌లో ఉన్న ఆ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రేమలో మోసపోయాననే మనోవేదనతో ఒక యువకుడు నిండు నూరేళ్ల జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించుకోవడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై మరింత దర్యాప్తు జరుపుతున్నారు.
