- గత బీఆర్ఎస్ హయాం నుంచే విద్యావ్యవస్థ నాశనం
- 29,800 స్కూళ్లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందట్లే
- విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి
వరంగల్, వెలుగు: తెలంగాణలో స్కూళ్ల నిర్మాణాలు, విద్యాభివృద్దికి నిధుల్లో కేటాయింపులు పెరగాలంటే.. రాష్ట్రంలో మరో జంతర్‍మంతర్ తరహా ఉద్యమం రావాలని రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బడి నిద్ర–బస్సుయాత్ర’ వరంగల్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా గురువారం ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకునూరి మురళి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‍లో ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బీఆర్‍ఎస్ సర్కార్ నాశనం చేసిందన్నారు. బీఆర్‍ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో రూ.29 వేల కోట్లు వ్యాపారులు, రియల్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పనంగా కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవే నిధులు విద్య కోసం ఖర్చు చేస్తే రాష్ట్రాభివృద్ధి జరిగేదన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ సర్కారులోనూ విద్యాభివృద్ధికి మొక్కుబడి కేటాయింపులే జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ విద్యాభివృద్ధి అంశంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.3.24 లక్షల కోట్లు వివిధ రంగాల కోసం కేటాయిస్తే.. తాము విద్యాభివృద్ధి కోసం అదనంగా రూ.6 వేల కోట్లు అడుగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 30 వేల స్కూళ్లు ఉండగా 29,800 నాణ్యమైన విద్య దొరకనివే ఉన్నాయని చెప్పారు. ఎడ్యుకేషన్ కోసం భూటాన్, వియత్నాం వంటి దేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం నిధులు కేటాయిస్తుంటే.. దేశంలో మాత్రం బడ్జెట్‍లో 2.5 శాతంతో అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నారన్నారు.
మోదీ ప్రభుత్వం సంపన్నులకు అవసరమైన బుల్లెట్ ట్రైన్ల వంటి ప్రాజెక్టులకు లక్షల కోట్లు కేటాయిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని 630 మండలాల్లో పూర్తి సౌలతులతో 2 వేల స్కూల్స్ నిర్మించాల్సి ఉందన్నారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.15 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. ప్రొఫెసర్ పద్మజ, రిటైర్డ్ ఐఏఎస్ చంపాలాల్, విద్యావేత్తలు రుబీనా, అశోక్, నిఖిల్, సృజన యాదవ్, డాక్టర్ జగదీశ్వర్, చంద్రభాను, రాజేందర్, సుంకరి ప్రశాంత్ పాల్గొన్నారు.
