హైదరాబాద్, వెలుగు: కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ కానిస్టేబుల్ (జీడీ) బి.రామచందర్ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు పిటిషనర్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని రెండు వారాల్లోగా హైదరాబాద్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్‌కు చెల్లించాలని జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి ఆదేశించారు.
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ 199వ బెటాలియన్‌కు తనను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కానిస్టేబుల్ రామచందర్ 2015లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను 2015 మార్చి 11న హైకోర్టు అడ్మిషన్ దశలోనే కొట్టివేసింది. అయితే, బీజాపూర్‌లో విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించుకోవచ్చని, దానిని అధికారులు సానుభూతితో పరిశీలించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతివాదులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ మరుసటి రోజే పిటిషనర్ పై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
రిట్ పిటిషన్‌లో ప్రతివాదులకు ఎలాంటి నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వలేదని, పిటిషనర్ బీజాపూర్‌లో విధుల్లో చేరకుండా.. తనకు ఎదురైన ఇబ్బందులపై ఎలాంటి వినతిపత్రం సమర్పించకుండానే ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ కేసు కొనసాగాలంటే ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావాల్సి ఉంటుందని, ఈ కేసులో అలాంటి ఉల్లంఘన జరగలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. రిట్ పిటిషన్‌ను ‘డిస్పోజ్’ చేశారంటూ పిటిషనర్ పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి అది అడ్మిషన్ దశలోనే కొట్టివేయబడిందని గుర్తుచేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసేలా వ్యవహరించినందున ఈ ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
