- పాల్గొన్న మంత్రులు, కలెక్టర్లు
నెట్‌వర్క్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లాకేంద్రాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొని జాతీయ జెండాలు ఆవిష్కరించి మాట్లాడారు. వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల కోసం ప్రజల భాగస్వామ్యంతో ప్రజలకు మరింత చేరువగా పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పరశ్రమలతోపాటు వ్యవసాయం, పర్యాటక, విద్య, వైద్య, ఆదివాసీ, సంక్షేమ రంగాల్లో సమగ్రంగా అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ అంకిత్, ఎస్పీ బి. రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
పోరాట స్ఫూర్తితో ప్రజాపాలన :మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 మహోన్నత ఘట్టమని, నాటి పోరాట స్ఫూర్తి ప్రజాపాలనకు మార్గదర్శకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకల్లో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం గురుపూజోత్సవంలో భాగంగా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌తో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ 17కు భారతదేశ, తెలంగాణ చరిత్రలో విశిష్టమైన స్థానం ఉందన్నారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
హరిత ఇంధన రాష్ట్రంగా తెలంగాణ
ఖమ్మం టౌన్, వెలుగు: హరిత ఇంధన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సెప్టెంబర్ 17న భారతదేశంలో కలిసిందన్నారు.
రాష్ట్రంలో 1,000 రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. 2030 నాటికి 20వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకం, పాలేరు లింక్ కాలువ, మున్నేరు-పాలేరు లింక్ కాలువ, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేశామని తెలిపారు. ఖమ్మం సిటీని వరదల నుంచి రక్షించేందుకు రూ. 525.36 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మిస్తున్నామన్నారు.
వేడుకల్లో భాగంగా పీఎంశ్రీ జడ్పీహెచ్ ఎస్, పందిళ్లపల్లి స్టూడెంట్స్ ప్రదర్శించిన ప్రజాపాలన పాట, ఎంజేపీటీబీసీ, డబ్ల్యూఆర్జేసీ, లంకపల్లి, దానవాయిగూడెం స్టూడెంట్స్ ప్రదర్శించిన తెలంగాణ ఆవిర్భావ పాట, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ టేకులపల్లి విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
