హైదరాబాద్, వెలుగు: నేర తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో ఫిర్యాదు లేదా ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందన్న కారణంతోనే కేసును కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో బాలుడికి యాసిడ్ తాగించారన్న ఆరోపణలపై మేడిపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ పార్వతం మంజుల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ జె. శ్రీనివాసరావు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కుటుంబ విభేదాల కారణంగా తన క్లయింట్‌ను క్రిమినల్ కేసులో ఇరికించారని, ఏప్రిల్ 9న ఘటన జరిగితే 14న ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది గతంలోనూ పిటిషనర్ బాలుడిపై రెండు, మూడు సార్లు హత్యాయత్నం చేశారని వాదించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జితేందర్‌రావు వీరమల్ల దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ దశలో కేసును రద్దు చేయడం సరికాదన్నారు. రికార్డుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ, వైద్య నివేదికలను పరిశీలించిన హైకోర్టు.. బాలుడు పొరపాటున యాసిడ్ తాగాడా, పిటిషనర్ తాగించారా అనే అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పేర్కొంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఆరోపణలపై ఇప్పుడే తుది నిర్ణయానికి రాలేమని తెలిపింది. ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం మాత్రమే కేసు రద్దుకు కారణం కాదని పునీత్ బెరివాలా వర్సెస్ ఢిల్లీ, హర్యానా వర్సెస్ భజన్‌లాల్, నీపా రిక ఇన్‌ఫ్రా వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. దీంతో పిటిషన్‌ను కొట్టివేసింది.
